
డ్యూటీకి డుమ్మా!
కార్వేటినగరం: మండలంలో ఆరోగ్య సిబ్బంది తీరు రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. డ్యూటీలకు డుమ్మా కొడుతూ రోగులను ముప్పుతిప్పలు పెడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షణ చేయాల్సిన సంబంధిత అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది.
మధ్యాహ్నానికే మూత
జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మేజర్ పంచాయతీలో మూడు సచివాలయాలు, మూడు ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. అందులో ముగ్గురు ఏఎన్‌ఎంలు, ఇద్దరు ఎంఎల్‌హెచ్‌పీలు విధుల్లో ఉన్నారు. వారు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విదుల్లో ఉండాలి. కానీ సిబ్బంది 3 గంటలకే తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సి ఉండగా.. 10 గంటల వరకు డ్యూటీకి రావడం లేదు. కత్తెరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లతో పాటు ఇద్దరు పర్యవేక్షకులు, ఒక సీహెచ్‌ఓ, సీహెచ్‌ఎన్ ఉన్నప్పటికీ సబ్‌సెంటర్లపై తనిఖీలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. శనివారం కార్వేటినగరం సబ్‌సెంటర్ 2.45 గంటలకే తాళాలు వేసి ఉండడంతో రోగులు వచ్చి నిరాశతో వెనుదిరగడం కనిపించింది.
మందుబిళ్లలూ కరువే
కార్వేటినగరం మేజర్ పంచాయతీ పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో జ్వరం, దగ్గు, జలుబు లాంటి వాటికి కూడా మందుబిళ్లలు, స్విరప్‌లు, ఇంజక్షన్లు ఉండడం లేదన్న విమర్శలున్నాయి. ఒకవేళ రోగులు వెళ్లి అడిగినా ‘మందుల్లేవ్’ అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.