
ఎవరు చోరీ చేశారో చెప్పేయండి!
చౌడేపల్లె: పెద్ద పంజాణి మండలం, ముత్తుకూరులోని ఓ ఇంట్లో జరిగిన చోరీ వ్యవహారం శనివారం రాజనాలబండ అభయాంజనేయస్వామి ఆలయం వద్దకు చేరింది. బాఽధితురాలి కథనం.. ముత్తుకూరుకు చెందిన లింగప్పగారి రెడ్డెమ్మ గత నెల 12న తన కుమార్తె ఉన్న పెద్దారికుంటకు వెళ్లింది. బీరువాలోని నగలు, నగదు భద్రపరచి తాళాలు మంచం పరుపు కింద దాచి బండ్లమిద్దికి తాళం వేసి వెళ్లింది. వారం రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు కిటికీ మార్గం గుండా ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన 20 గ్రాముల బంగారు, రూ.1.5 లక్షల నగదును చోరీ చేశారు. ఈనెల 18న ఇంటికొచ్చిన రెడ్డెమ్మ తాళాలు తీసి ఇంట్లోకి వెళ్లి చూసింది. బీరువాలోని నగదు కనపడక పోవడంతో చుట్టు పక్కల విచారించింది. ఆపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంగా గ్రామంలోని ఇంటికొక మనిషితో సత్యప్రమాణాలు చేసేందుకు శనివారం రాజనాలబండకు చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులతో అర్చకులు కృష్ణమూర్తి వేర్వేరుగా విచారణ జరిపి ఈ నెల 11కు వాయిదా వేశారు. ఆ రోజు గ్రామస్తులు రాజనాలబండకు రావాలని తీర్మానించారు.