
ఉద్యోగోన్నతులు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డీఈవో పూల్‌లో ఉన్న 166 మందికి ఉద్యోగోన్నతులు కల్పించడం హర్షణీయమని ఎస్‌ఎల్‌టీఏ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దొడ్డా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 నుంచి భాషా పండితులు ఉన్నతీకరణ ఉద్యోగోన్నతుల్లో ఎస్జీటీలకు స్థానం కల్పించడంతో డీఈవో పూల్‌లో ఉండిపోయారన్నారు. స్థిరమైన చోటు లేక, సుదీర్ఘకాలంగా ఉద్యోగోన్నతులు లభించక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగు 123, హిందీ 34, ఉర్దూ 2, తమిళం 6, సంస్కృతం 1 మొత్తం 166 మందిని డీఈవో పూల్ నుంచి తొలగించి ఉద్యోగోన్నతులు కల్పించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.
‘అల్లుకున్న’ నిర్లక్ష్యం
గుడిపాల మండలంలోని గొల్లమడుగు గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే చేతికందే ఎత్తులో ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసిన దిమ్మె చుట్టూ తీగలు, ముళ్ల పొదలు అల్లుకుపోయాయి. అలువైపు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఆదమరిస్తే అంతే సంగతులు. పెను ప్రమాదం ముంచుకురాకముందే ట్రాన్స్‌కో అధికారులు మేల్కొనాల్సి ఉంది. – గుడిపాల