
దంచికొట్టిన వర్షం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. ఉదయం 8 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుని మొరవెత్తాయి. భారీ వర్షం దెబ్బకు పలు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు సైతం దెబ్బతిన్నాయి.
● పలమనేరు కౌండిన్య నదిలో నీట్టిమట్టం 8 అడుగులు పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరింత వర్షం పడితే ప్రవాహం ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంటున్నారు. కలగటూరు మార్గంలోని చెక్ డ్యామ్ వద్ద వర్షపు నీరు ప్రవహిస్తోంది. అయితే అక్కడ రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదు. వరినాట్లు పూర్తిగా నీట మునగాయి. టమాట నేల రాలింది. మచ్చ రోగం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
● తవణంపల్లిలోని మాధవరం వంక పొంగిపొర్లుతోంది. తొడతర బ్రిడ్జిపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిచిపో యాయి. సాయంత్రానికి ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. అలాగే బాహుదానది ప్రవాహంతో కాణిపాకం నుంచి ఉత్తర బ్రహ్మణపల్లి రోడ్డులో రాకపోకలు స్తంభించాయి. ఎక్కువగా బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. అయితే ప్రవాహ ఉధృత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు చిత్తూరు, గుడిపాల, జీడీనెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, పాలసముద్రం, కార్వేటినగరం తదితర మండలాల్లో సైతం కాలువలు, వంకలు, నదులు జలకళను సంతరించుకున్నాయి.
కృష్ణాపురం జలాశయం గేట్ల ఎత్తివేత
నగరి : జీడీ నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, కృష్ణాపురం జలాశయం నిండడంతో శనివారం మధ్యాహ్నం గేట్లు ఎత్తివేసి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసినట్లు నగరి తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. నగరి మండల కుశస్థలి నది ఒడ్డు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో 9000299091, 6305312141, 9951777547, 9704623597, 8179399712 సంప్రదించాలన్నారు.

దంచికొట్టిన వర్షం

దంచికొట్టిన వర్షం

దంచికొట్టిన వర్షం

దంచికొట్టిన వర్షం

దంచికొట్టిన వర్షం

దంచికొట్టిన వర్షం