
బోయకొండ హుండీ ఆదాయం రూ.62.67 లక్షలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.62.67 లక్షల వరకు వచ్చినట్టు ఈఓ ఏకాంబరం తెలిపారు. శనివారం కానుకలు లెక్కించగా నగదు రూ.62,21,142, బంగారం 72 గ్రాములు, వెండి 705 గ్రాములు సమకూరినట్టు వెల్లడించారు. వీదేశీ కరెన్సీ తోపాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ.46,310 నగదు లభించిందన్నారు. ఈ ఆదాయం 68 రోజులకు వచ్చినట్లు ఈఓ చెప్పారు. చిత్తూరు దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో దయానంద
చిత్తూరు అర్బన్: పలమనేరు నియోజకవర్గానికి చెందిన ఆర్‌జీ.దయానందను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. శనివారం ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి.
30 మందికి అంతర్‌జిల్లా బదిలీలు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేస్తున్న టీచర్లకు శనివారం అంతర్‌జిల్లా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ బదిలీలకు సంబంధించి డీఈవో వరలక్ష్మి పర్యవేక్షణలో చిత్తూరు డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియలో అంతర్‌జిల్లా బదిలీలకు స్పౌజ్ కేటగిరీలో 10 మంది, మ్యూచువల్ కేటగిరీలో 20 మొత్తం 30 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం వారికి అంతర్‌జిల్లా బదిలీల ఉత్తర్వులు అందజేశారు. అదే విధంగా ఇద్దరు ఎంఈవోలకు ఆర్జేడీ కార్యాలయంలో అంతర్‌జిల్లా బదిలీలు నిర్వహించి బదిలీ ఉత్తర్వులు జారీచేశారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండాయి. క్యూలైన్ గోగర్భం వద్దకు చేరింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,581 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,976 మంది తలనీలాలు అర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.60 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో స్వామివారం దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.