
స్తంభించిన జనజీవనం
పుంగనూరు: సోమల మండలంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురవడంతో గార్గేయనది పొంగి పొర్లింది. నీటి ఉధృతికి సోమల మండలంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. టమాట, వరి, చెరుకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొండల మధ్యన గల గార్గేయ నదిలో నీటి నిల్వలు భారీగా చేరాయి. ఆవులపల్లె, రాయలపేట రోడ్డు పై సుమారు మూడు అడుగుల ఎత్తువరకు నీరు ప్రవహించింది. పెద్దఉప్పరపల్లె నుంచి రాయలపేటకు వెళ్లే రహదారి కోతకు గురైంది. స్థానిక ప్రభుత్వాస్పత్రి ముఖద్వారం దెబ్బతింది. మండలంలోని తుగడంవారిపల్లి, వడ్డిపల్లె, పొదలగుంట్లపల్లె, కొత్తూరు ఇర్లపల్లె, పట్రపల్లె, రెడ్డివారిపల్లెతో పాటు పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అన్నిశాఖల అధికారులు అప్రమత్తమయ్యారు.