
ఒంటరి ఏనుగు దాడిపై విచారణ
పలమనేరు : ఇటీవల ఒంటరి ఏనుగు పలమనేరులోకి వచ్చి హల్‌చల్‌చేసి స్థానిక ఎఫ్‌ఆర్వో సుకుమార్‌తో పాటు ఎలిఫెంట్ ట్రాకర్ హరిపై దాడి చేసిన సంఘటనపై డీసీసీఎఫ్ చైతన్యకుమార్‌రెడ్డి విచారణ చేపట్టారు. బుధవారం పట్టణ సమీపంలోని పాతకీలపట్లరోడ్డులో సుకుమార్‌ను ఏనుగు దాడి చేసిన స్థలాన్ని స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. సంఘటన జరిగినప్పుడు ఏనుగు ఎక్కడ ఉంది, ఏ వైపు నుంచి వచ్చిందని ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొసలిమడుగు వద్ద ఉన్న కుంకీ ఎలిఫెంట్ క్యాంపునకు వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించారు. కుంకీలతో ఏనుగులను ఎలా మళ్లిస్తున్నారు, ఇక్కడ ఏనుగుల దాడులు ఎందుకు తగ్గలేదని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏనుగుల కారణంగా ఒక్క ప్రాణం కూడా పోరాదనే తలంపుతో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కుంకీలను తెప్పించారన్నారు. అయితే అనుకున్న మేర ఫలితాలు రావాల్సి ఉందన్నారు. దీనిపై మరింత మెరుగ్గా చేయాలని అనుకుంటున్నామన్నారు. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సెక్షన్ ఆఫీసర్ సుకుమార్‌ను ఆయన పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట సబ్ డీఎప్‌ఓ వేణుగోపాల్, ఎఫ్‌ఆర్వో నారాయణ, సిబ్బంది ఉన్నారు.