
కిలో మామిడికి రూ.12 ఇచ్చి తీరాల్సిందే
చిత్తూరు కలెక్టరేట : జిల్లాలోని మామిడి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.12 ఇచ్చి తీరాల్సిందేనని జిల్లా మామిడి సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జనార్దన్, హరిబాబుచౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు, రైతులు సోమవారం మార్కెట్‌యార్డు నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మామిడి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో తోతాపురి మామిడికి సీఎం ప్రకటించిన ప్రకారం కిలోకు రూ.12 చెల్లించి తీరాలన్నారు. మామిడి రైతులకు కచ్చితంగా ఫ్యాక్టరీలు రూ.8, ప్రభుత్వం తరఫున రూ.4 మొత్తం రూ.12 ఒకేసారి ఇవ్వాలన్నారు. సత్వరం రైతుల ఖాతాల్లో నగదు జమచేయాలని డిమాండ్ చేశారు.
రెండు నెలలు దాటినా..!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 35 వేల మంది రైతులు ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేశారని, రెండు నెలలు దాటినా అటు ఫ్యాక్టరీలు, ఇటు ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు జమచేయకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.12 ఇవ్వకపోతే ఉద్యమాలే శరణ్యమని హెచ్చరించారు. ర్యాంపులు రూ.3, రూ.4 మాత్రమే చెల్లించాయన్నారు. ఫ్యాక్టరీలతో పాటు ర్యాంపుల అధినేతలు రూ.8 చెల్లించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల ఓపికను పరీక్షిస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నెల ఆఖరి లోపు మొత్తం నగదు చెల్లించాల్సిందేనన్నారు. గుడిపాల రైతుసంఘ నాయకులు ప్రకాష్ మాట్లాడుతూ రైతులకు ఏ మాత్రం అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు. గౌరవ అధ్యక్షులు ఆనందనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు మునీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీలు తక్షణం రూ.8 చెల్లించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో అక్టోబర్ 1 నుంచి రహదారులు దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు, హేమలత, రైతులు భాస్కర్‌నాయుడు, మునిరత్నంనాయుడు, బెల్లంకొండ శ్రీనివాసులు, లవకుమార్‌రెడ్డి, సంజీవరెడ్డి, సందీప్, భారతి, చంద్రమౌళి, మురళి, త్యాగరాజులురెడ్డి పాల్గొన్నారు.