
పోలీస్ బాస్ తుషార్ డూడీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నూతన ఎస్పీగా తుషార్ డూడీ నియమితులయ్యారు. ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ మణికంఠను బదిలీ చేశారు. ఈయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
కూటమి నేతలకు నచ్చక?
గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏప్రిల్ 4వ తేదీన మణికంఠ చిత్తూరు ఎస్పీగా నియమితులయ్యారు. దాదాపు 17 నెలల పాటు చిత్తూరు ఎస్పీగా మణికంఠ రాణించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన దాదాపు 45 మంది కానిస్టేబుళ్లను ఈయన సస్పెండ్ చేశారు. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు అధికారులపై విచారణకు ఆదేశించినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక పుంగనూరులో జరిగిన ఓ టీడీపీ కార్యకర్త హత్య ఘటనలో కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే నుంచి నాయకుల వరకు మణికంఠపై ఒంటికాలితో పైకిలేచారు. ఓ దశలో ఈ హత్యకు మణికంఠ బాధ్యత వహించాలని, తాము అడిగిన పోలీసులకు ఆయా స్టేషన్లలో పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం వల్లే హత్య జరిగిందని బురదను కూడా చల్లారు. బంగారుపాళ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం, కార్యకర్తపై జరిగిన దాడిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్‌మన్‌ను సస్పెండ్ చేయడం అనైతికమంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధానంగా కూటమి పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు మణికంఠ పనితీరు నచ్చలేదనే చెప్పాలి. దీనిపై ఏకంగా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఎస్పీ బదిలీల ప్రక్రియలో మణికంఠకు స్థానచలనం కలగడం అధికారపార్టీ నేతలకు ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.
క్రమశిక్షణ ప్రధానం
చిత్తూరు కొత్త ఎస్పీగా నియమితులైన డూడీకు క్రమశిక్షణే ప్రధానం. 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం బాపట్ల ఎస్పీగా పనిచేసి చిత్తూరుకు వస్తున్నారు. డూడి స్వస్థలం రాజస్థాన్‌లోని ఝున్జున్ నగరం. ఇండోర్ ఐఐటీలో ఇంజినీరింగ్ చదివిన ఈయన.. మూడో ప్రయత్నంలో సివిల్ సర్వీసుకు ఎంపికై ఐపీఎస్ అధికారి అయ్యారు. కర్నూలులో ఐపీఎస్ శిక్షణ పూర్తి చేశారు. గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా సర్వీస్‌లో చేరారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదోన్నతి పొంది 2024 ఫిబ్రవరిలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు. గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండెంట్‌గా, మన్యంలో చింతపల్లి ఏఎస్పీగా కూడా పనిచేశారు. తుషార్ డూడీకి ఎస్పీగా చిత్తూరులో మూడో పోస్టింగ్. సోమవారం ఇక్కడ బాధ్యత తీసుకునే అవకాశముంది.

పోలీస్ బాస్ తుషార్ డూడీ