
నేడు, రేపు మహిళా సాధికారత సదస్సు
తిరుపతి అర్బన్ : మహిళల సాధికారత అంశాన్ని అజెండాగా చేసుకుని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని వేదికగా తీసుకుని దేశస్థాయి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లోకసభ స్పీకర్ ఓంబిర్లా ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీ సమావేశాన్ని ఆది, సోమవారం జరుపుకోనున్నారు. సదస్సు ముఖ్య ఉద్దేశ్యం వికసిత్ భారత్‌లో భాగంగా మహిళలు సైతం డిజిటల్ దిశగా అడుగులు వేయడానికి, క్వాంటమ్ కంప్యూటరింగ్, బయో టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయ, వ్యాపార రంగాల్లో మహిళల పాత్ర తదితర సెక్టార్లకు సంబంధించి చర్చలు జరపనున్నారు. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులు తదితరులు లైజన్, నోడల్ అధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
నేడు ముఖ్య అతిథులు రాక
ఆదివారం ఉదయం 10 గంటలకు తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌కు పలువురు వీఐపీలు రానున్నారు. సదస్సుకు సంబంధించి రెండు రోజుల పాటు రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం చంద్రగిరి కోటను సందర్శించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులతో పాటు లోకసభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాష్ట్ర శాసనసభ స్వీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణంరాజు, లోకసభ కమిటీ చైర్‌పర్సన్ పురందేశ్వరి, రాష్ట్ర కమిటీ చైర్‌పర్సన్ చరితారెడ్డి, పలువురు ఐఏఎస్ సీనియర్ అధికారులు ఆదివారం హాజరు కానున్నారు. అలాగే సోమవారం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారు.
సాక్షి, టీవీ9, ఎన్‌టీవీ, 10 టీవీలకు పాస్‌లు నిలుపుదల
జిల్లాలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ మహిళా సదస్సు కార్యక్రమానికి మీడియాకు సమాచారశాఖ వారు ఆహ్వానం పలికారు. అయితే దేశ స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో సమాచారశాఖ నుంచి పాస్‌లు జారీ చేసిన వారు మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాక్షి, టీవీ9, ఎన్‌టీవీ, 10 టీవీలకు చెందిన రిపోర్టర్లకు పాస్‌లను ఇవ్వడం లేదని సమాచారశాఖ జిల్లా అధికారి గురుస్వామి శెట్టి స్పష్టం చేశారు.