
ఏ.కొత్తకోటలోనే రైతుసేవా కేంద్రం కొనసాగించాలి
చౌడేపల్లె: మండలంలోని ఏ.కొత్తకోట గ్రామంలోనే రైతుసేవా కేంద్రాన్ని కొనసాగించాలని రైతులు ఏవో మోహన్‌కుమార్‌ను వేడుకున్నారు. గత ప్రభుత్వంలో రైతుల శ్రేయస్సు కోసం తమ గ్రామంలోనే రైతుభరోసా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో ఇటీవల దుర్గసముద్రం రైతుసేవా కేంద్రానికి ఏ.కొత్తకోటను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్ చేయడం తగదన్నారు. రెండు రోజుల క్రితం ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న దుర్గసముద్రం రైతు సేవా కేంద్రానికి వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. రైతులు విజయ్‌కుమార్‌రెడ్డి, షఫీ, మునిరాజ, మల్లికార్జున పాల్గొన్నారు.
సకాలంలో వైద్యం అందించాలి
పుంగనూరు: ఏరియా ఆస్పత్రిలో గ్రామీణ ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ వైద్యులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, వైద్యులు, నర్సుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ హరగోపాల్, డాక్టర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసేవలు ప్రజలకు అందిస్తున్నట్టు వెల్లడించారు.
ఫొటో, వీడియోగ్రఫీలపై ఉచిత శిక్షణ
చంద్రగిరి : యూనియన్ బ్యాంక్ , గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 15వ తేదీ (సోమవారం) నుంచి 31 రోజుల పాటు పురుషులు, మహిళలకు ఫొటో, వీడియోగ్రఫీపై ఉచితంగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి.సురేష్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, రాను పోను ఒక్కసారి చార్జీలు ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువ పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్ , రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, 4 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సంస్థకు వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 79896 80587, 94949 51289 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.