
రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలు సీజ్
పుంగనూరు: టపాకాయల నిల్వలపై చిత్తూరు ఎస్‌బీ అధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి, సుమారు రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలను సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని టపాకాయల వ్యాపారి డీష్‌బాబు, శ్రీధర్‌గుప్తా, రాఘవేంద్ర సప్లయర్స్ వారు అనుమతులు లేకుండా సుమారు రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలను నిల్వ చేసి ఉండడంపై ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. సీఐ సుబ్బరాయుడు, పోలీసులతో కలసి దాడులు చేసి, టపాకాయలను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.
చిత్తూరులో బాణసంచా సీజ్
– ఇద్దరి అరెస్ట్
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో అనుమతుల్లేకుండా తరలుతున్న బాణసంచా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. మంగళవారం సాయంత్రం చిత్తూరు–బెంగళూరు జాతీయ రహదారిపై టూటౌన్ సీఐ నెట్టింకటయ్య ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ మినీ లారీని తనిఖీ చేయగా.. తమిళనాడులోని శివకాశి నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలకు 70 బాక్సుల్లో బాణసంచా తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు గుర్తించారు. బాణసంచాతో పాటు వీటిని తరలిస్తున్న మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఎం.రవికుమార్, యాదమరికి చెందిన మణిగండన్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో సిబ్బంది సుధీర్, బాబురెడ్డి, బాబు, రాజేష్, సుబ్రమణ్యం, బాషా, నాగరాజు ఉన్నారు.

రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలు సీజ్