
ప్రలోభాలకు గురిచేసే నైజం వైఎస్సార్‌సీపీకి లేదు
● మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతల వెల్లడి ● స్వతహాగా వస్తే పార్టీలో చేర్చుకున్నాం ● కూటమి పాలన తీరును చూసి తమ వైపు ఆకర్షితులవుతున్నారు
చౌడేపల్లె: ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను ప్రలోభాలు పెట్టి తమ పార్టీలోకి రప్పించుకునే నైజం వైఎస్సార్‌సీపీకి లేదని మండల పార్టీ అధ్యక్షుడు జి.నాగభూషణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం పెద్దకొండామర్రిలో వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటరమణ, మాజీ సింగిల్‌విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నాగభూషణరెడ్డి మాట్లాడుతూ ఇటీవల మండలంలో ఐదు రోజులపాటు బాబు షూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టామని, కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని వివరిస్తూ చైతన్యం తెచ్చామని చెప్పారు. చివరి రోజైన ఆదివారం శెట్టిపేట పంచాయతీ తోటకురప్పల్లెకు చెందిన టీడీపీ నాయకుడు ఎస్. కుమార్‌రాజు స్వతహాగా నడుమూరులో జరుగుతున్న బాబు షూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారని, అక్కడే పార్టీ నేతల ఆధ్వర్యంలో వైస్సార్‌సీపీ కండువాను వేసి కుమార్‌రాజును స్వాగతించినట్లు తెలిపారు. మరుసటిరోజు ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు కుమార్‌రాజు ఇంటికెళ్లి మళ్లీ టీడీపీలోకి చేర్చుకున్నట్లు పత్రికల ద్వారా తెలిసిందన్నారు. ప్రలోభాలకు గురిచేసి కుమార్‌రాజును పార్టీలోకి చేర్చుకున్నట్టు వచ్చిన ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. అలాంటి సంస్కృతి తమ పార్టీకి లేదని గుర్తుచేశారు. సమావేశంలో సర్పంచులు జయసుధమ్మ, షంషీర్, ఓబుల్‌రెడ్డి, రఘునాథరెడ్డి, కో–ఆప్షన్ మెంబరు సాధిక్‌బాషా, చెంగారెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు అమర, నాయకులు సుబ్రమణ్యంరాజు, శంకరప్ప, రవికుమార్‌రెడ్డి, వెంకటేష్‌రాజు, ప్రభాకర్, హనుమంతురెడ్డి, శంకర్‌రెడ్డి, కృష్ణప్ప, వెంకటరమణ, మురళి తదితరులు పాల్గొన్నారు.