అమ్మ పాలే బిడ్డకు అమృతం | - | Sakshi
Sakshi News home page

అమ్మ పాలే బిడ్డకు అమృతం

Aug 5 2025 6:35 AM | Updated on Aug 5 2025 6:35 AM

అమ్మ పాలే బిడ్డకు అమృతం

అమ్మ పాలే బిడ్డకు అమృతం

● 7 వరకు జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ● అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు

చిత్తూరు కలెక్టరేట్‌ : తల్లిపాల ప్రాముఖ్యతపై ఐసీడీఎస్‌, ఇతర అధికారులు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పుట్టిన బిడ్డకు ఎలా పాలను పట్టించాలనే విషయమై వైద్య బాలింతలకు సూచనలిస్తున్నారు. తల్లిపాల ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ముర్రుపాలను బిడ్డకు పట్టిస్తే వ్యాధినిరోధక శక్తి పెరిగి భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని అవగాహన కల్పిస్తున్నారు.

తల్లి పాలు బాగా రావాలంటే!

మహిళ గర్భందాల్చినప్పటి నుంచి పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా ఆకుకూరలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని, అతిగా స్వీట్లను తినరాదని చెబుతున్నారు. బిడ్డను పడుకోబెట్టి, నిలబెట్టి పాలు పట్టకూడదని, పాలిచ్చే సమయంలో కేఫీ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానియాలు తీసుకోకూడదని పేర్కొంటున్నారు.

ముర్రుపాలలో రోగ నిరోధక శక్తి అధికం

ముర్రుపాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది అవగాహన లేక బిడ్డకు ముర్రుపాలను తాగించడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఈ పాలలో వ్యాధి నిరోధకశక్తిని పెంచే గుణం ఉంటుంది. సమతుల్యమైన పోషకాహార పదార్థాలు ఉంటాయి. చాలా రకాల వ్యాధులు రాకుండా తల్లిపాలు కాపాడతాయి. తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు. తల్లిపాలు తాగే పిల్లల్లో ఆకస్మిక మరణాలు తక్కువేనని వైద్యులు చెబుతున్నారు.

అమృత జల్లు!

తల్లిపాలు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ, ఆస్తమా, చర్మవ్యాధుల నుంచి బిడ్డలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి తోడ్పడుతాయి. అందుకే బిడ్డ జన్మించిన గంటలోపు తల్లికి వచ్చే ముర్రుపాలు పట్టించాలి. ఆ తర్వాత ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. రోజులో 8 నుంచి 10 సార్లు లేదా ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి బిడ్డకు తల్లిపాలు పట్టించాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. తల్లిపాలలో ప్రొటీన్లు, ఒమెగా 3, ఒమెగా 6, ఒమెగా 9, విటమిన్లు ఉండి బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడుతాయి. లాక్టోజుతో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల బారి నుంచి కాపాడుతాయి. డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్‌, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

జిల్లా సమాచారం

విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం ‘తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం’ అనే నినాదంతో అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ముర్రుపాలు తప్పనిసరిగా బిడ్డకు పట్టించాలని సూచిస్తున్నాం. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లులకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నివారణకు దోహదపడుతాయని తెలియజేస్తున్నాం.

– వెంకటేశ్వరి, జిల్లా ఐసీడీఎస్‌ పీడీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement