
లారీని ఢీకొన్న బైక్
● ఇద్దరు అక్కడికక్కడే మృతి
● మృతులు బంగారుపాళెం వాసులుగా గుర్తింపు
చంద్రగిరి: ఎదరుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి పనపాకం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తంబుగానిపల్లికి చెందిన పరంధామ(26) వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంలో సోమవారం రాత్రి తిరుపతికి పయనమయ్యాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గడ్డం హరీష్ నాయుడు(24) తన తల్లితో కలసి కాణిపాకంలో ఉంటూ డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. కాణిపాకానికి చేరుకున్న పరంధామ, హరీష్ నాయుడును తన ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని ఇద్దరూ తిరుపతికి పయనమయ్యారు. పనపాకం టోల్‌ప్లాజా దాటుకుని వస్తున్న క్రమంలో ఎదురుగా తిరుపతి నుంచి చిత్తూరు వైపుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో పరంధామతో పాటు హరీష్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. హైవే పోలీసులు లారీ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడంతోనే..
పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి విస్తరణ పనులు ఆగిపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. రహదారి పనులు పనపాకం నుంచి జక్కలవారిపల్లి వరకు సుమారు కిలోమీటర్ మేర గత కొన్నేళ్లుగా ఆగిపోయాయి. దీంతో రహదారి విస్తరణ అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలిక సింగిల్ రోడ్డును ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనాదారులకు సింగిల్ రోడ్డు అన్న విషయం తెలియకపోవడంతో, మలుపు తీసుకోకుండా నేరు వెళ్లి లారీని ఢీకొట్టారు. ఇకనైనా రహదారి విస్తరణ అధికారులు స్పందిచాల్సి ఉంది.

లారీని ఢీకొన్న బైక్