
జీవాలపై అడవి జంతువుల దాడి
శాంతిపురం: మండలంలోని చెంగుబళ్ల గ్రామంలో మంగళవారం రాత్రి గొర్రెల మందపై అటవీ జంతువులు దాడి చేశాయి. దీంతో 22 జీవాలు మృతి చెందగా, మరో 10 గాయపడినట్టు గొర్రెల యజమాని జంగం కృష్ణప్ప తెలిపాడు. బుధవారం వేకువజామున ఈ విషయం గుర్తించినట్లు వెల్లడించారు. ఈ దాడిలో సుమారు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్టు సర్పంచ్ పూలకుంట భాస్కర్ వెల్లడించారు. దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దార్ శివయ్య, ఎస్‌ఐ నరేష్, పశువైద్యాధికారి ఆమని ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. రేచుకుక్కలు లేదా తోడేళ్ల గుంపు గొర్రెలపై దాడి చేసినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ట్రాక్టర్ చోరీ
గుడిపాల : మండలంలోని పశుమంద హరిజనవాడకు చెందిన వినాయకం అనే వ్యక్తికి సంబంఽధించిన ట్రాక్టర్ చోరీకి గురైనట్లు ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. పశుమంద దళితవాడకు చెందిన వినాయకం 2018లో సొంతంగా ట్రాక్టర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి అతడి పనులు చేసుకుంటూ ఉండేవాడు. అతడి ట్రాక్టర్‌ను నరహరిపేట–రామాపురం రోడ్డు సమీపంలోని పశుమందలోని పశువుల షెడ్డు వద్ద ట్రాక్టర్‌ను పెట్టేవాడు. కాగా 22వ తేదీ ఉదయం ట్రాక్టర్‌ను చూసుకోగా ఎక్కడా కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినా ట్రాక్టర్ కనపడకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.