
రాజకీయ ఒత్తిడికి తలొగ్గొద్దు
● ఉద్యోగ ధర్మాన్ని విస్మరించొద్దు ● ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వండి ● బడిబయట పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి ● పలు శాఖల సమావేశాల్లో కలెక్టర్ వెల్లడి
చిత్తూరు కలెక్టరేట్ : రాజకీయ ఒత్తిళ్లకు జిల్లా అధికారులు తలొగ్గొద్దని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని తెలిపారు. రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ, రక్షణ బాధ్యత ఆయా రెవెన్యూ అధికారులదేనన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో నమోదయ్యే అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ప్రజలను ఉద్దేశపూర్వకంగా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రెవెన్యూ ఉద్యోగుల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ
జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగుల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సేకరణలో అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు తన దృష్టికి వస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగరాదన్నారు. ఎక్కడైనా రెవెన్యూ ఉద్యోగులపై దాడులు జరిగినట్లు తన దృష్టికి వస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పీజీఆర్‌ఎస్‌లో పరిష్కరించే సమస్యలకు తప్పనిసరిగా ప్రజలకు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌వో మోహన్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ నరేంద్రపాడెల్, ఆర్‌డీవోలు, పలు మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
బడిబయట 4,447 మంది పిల్లలు
చిత్తూరు జిల్లాను బడిబయట పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన విద్యాశాఖ అధికారుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆ సదుపాయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 4,447 మంది బడిబయట పిల్లలున్నారని తెలిపారు. బడి మానేసిన ప్రతి విద్యార్థి ఇంటికి హెచ్‌ఎం వెళ్లి మాట్లాడాలన్నారు. విద్యార్థి పరిస్థితిని తెలుసుకుని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. జిల్లాలోని మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో వసతులు కల్పించి విద్యార్థుల నమోదు శాతం పెంచాలన్నారు. సమావేశంలో డీఈవో వరలక్ష్మి, ఏపీసీ వెంకటరమణ, పలు మండలాల ఎంఈవోలు, క్లస్టర్ హెచ్‌ఎంలు పాల్గొన్నారు.