
ఎవరికి చెప్పేది ‘భూ’బాధలు?
ఫ్రీహోల్డ్ భూములపై కూటమి కన్నెర్ర
● నిబంధనల మేరకన్న భూములుపైనా ఆంక్షలే ● లేఅవుట్లలో సైట్లను కొని ఇబ్బందులు పెడుతున్న వైనం ● అవసరానికి భూములు విక్రయించాలన్నా కుదరదు ● ప్రభుత్వం నుంచి త్వరలో ఆదేశాలంటున్న అధికారులు
పలమనేరు: ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడినట్టుంది భూముల రిజిస్ట్రేషన్లపై కూటమి ప్రభుత్వ తీరు. గత ప్రభుత్వంలో ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో ఎన్నో అక్రమాలున్నాయని, ఇందుకు సహకరించిన అధికారులపై విచారణ చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఫ్రీహోల్డ్ భూములపై బ్యాన్ పెట్టింది. దీంతో నిషేధిత జాబితాలోని ఇంటి స్థలాలు, పొలాలు కూటమి రిజిస్ట్రేషన్లు లేకుండా పోయాయి. అయితే నిబంధనల మేరకు అన్నీ సక్రమంగా ఉన్నా ఈ బ్యాన్ కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని చాలామంది బాధితులు ఆవేదన చెందుతున్నారు. వీటి రిజిస్ట్రేషన్లపై అనుమతులు ఇస్తామన్న ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు సాకు చూపి
మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అక్రమాలు జరిగాయని.. అందుకే ఫైళ్లను దగ్ధం చేశారనే సాకుతో కూటమి ప్రభుత్వం జిల్లాలో గతంలో ఫ్రీహోల్డ్ అయిన అన్ని భూములపై బ్యాన్ పెట్టింది. క్షేత్ర స్థాయిలో సర్వే నంబర్ల వారీగా విచారణ లేకుండానే ఎన్నో అక్రమాలు జరిగాయంటూ ప్రాథమిక విచారణతోనే 1,05,409 ఎకరాలపై నిషేధం విధించింది. లేఅవట్లలో సైతం భారీ అక్రమాలు జరిగాయని చెబుతున్నారేగానీ అవి ఎలా సాగాయి.. ఇందులో నిజమెంతో సంబంధిత అధికారులు సైతం చెప్పలేకపోతున్నారు.
జిల్లా సమాచారం
ఫ్రీహోల్డ్ చేసిన మొత్తం
భూములు : 1,59,327 ఎకరాలు
ఆక్రమణలు జరిగాయని
ఆరోపణలున్న భూములు : 1,05,409 ఎకరాలు
సక్రమంగా ఉన్నాయని
చెబుతున్న భూములు : 53,917 ఎకరాలు
మా పరిస్థితి ఏంటి?
రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫలానా సర్వే నంబరు రిజిస్ట్రేషన్ అవుతుందని చెబితేనే స్థలాలను కొన్నాం. ఇప్పుడు అన్ని సర్వే నంబర్లను బ్యాన్ చేస్తే మా పరిస్థితేంటి. అప్పోసప్పో చేసి జాగాలు కొని ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విచారణల పేరిట ఇలా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు.
– హేమంత్‌కుమార్‌రెడ్డి, పలమనేరు
మరో రెండు నెలల్లో..
ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై మరో రెండు నెలలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావచ్చని భావిస్తున్నాం. ఆ మేరకు సక్రమ జాబితాలో ఉన్న భూములు, స్థలాలు తప్పకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఫ్రీహోల్డ్ భూముల సర్వే నంబర్లతో సహా ఆన్‌లైన్ అయ్యాక వాటిని అప్‌లోడ్ చేస్తారు.
– ఏ.వెంకటరమణమూర్తి, జిల్లా రిజిస్ట్రార్
మళ్లీ మొదటికే..!
కూటమి ప్రభుత్వం చెబుతున్నట్టు జిల్లాలో కేవలం 53,917 ఎకరాలను మాత్రమే రిజిస్ట్రేషన్లకు అనుమతులిస్తే మిగిలిన భూముల మాటేమిటో అర్థంకావడం లేదు. అసలు ఫ్రీహోల్డ్‌లో అక్రమాలు ఎలా జరిగాయో అధికారులు సైతం ఇంతవరకు చెప్పడం లేదు. ఎవరైనా సంబంధిత రిజిస్ట్రర్ కార్యాలయానికి వెళితే మీ భూమి నిషేధిత జాబితాలో ఉందని చెప్పి పంపేస్తున్నారు. గతంలో సక్రమంగా ఉన్నాయనే వీటిపై క్రయ, విక్రయాలు జరిగాయి. కోట్లాది రూపాయలు పెట్టి చాలా మంది ఈ భూములును కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇవి రిజిస్ట్రర్ కాకపోతే వారి పరిస్థితేంటి. మొత్తం భూములపై విచారణ జరిపి సవ్యంగా ఉన్న భూముల జాబితా ఇస్తామన్న అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.

ఎవరికి చెప్పేది ‘భూ’బాధలు?

ఎవరికి చెప్పేది ‘భూ’బాధలు?

ఎవరికి చెప్పేది ‘భూ’బాధలు?