
సర్కారు బడులు నిర్వీర్యం
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం సర్కారు బడులను నిర్వీర్యం చేస్తోందని తిరుపతి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ధ్వజమెత్తారు. తిరుమల ఆలయంలోనే కాదు భారతదేశంలో ఏ ఆలయాల్లోనైనా, ఎక్కడైనా అన్యమతస్తులు ఉండవచ్చని వా్‌య్‌ఖ్యానించారు. ఈ మేరకు గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. తిరుమలలో అన్యమతస్తులకు అనుమతి నిరాకరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం తదితర అంశాలపై విమర్శలు గుప్పించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమతస్తులను అనుమతించకపోవడం దారుణమన్నారు. అదేక్రమంలో ప్రస్తుతం తిరుమల దేవస్థానంలో దళితులెవ్వరూ ఉద్యోగాలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అన్యమతస్తులకు తిరుమలతో పాటు దేశంలోని అన్ని దేవాలయాల్లోకి ప్రవేశం కల్పించే అంశానికి సంబంధించి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్య హాజరు తక్కువగా ఉందని సాకు చూపుతూ అనేక ప్రాథమిక పాఠశాలలను మూసి వేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో కూటమి నాయకులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సంబంధిత అంశాలను రాష్ట్ర ప్రజలు సున్నితంగా గమనించాలని సూచించారు. టీడీపీ, బీజేపీ నాయకుల అవినీతి, అక్రమాలపై తాను పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.