
ఆకట్టుకున్న దుర్యోధన వధ
సదుం: మండలంలోని భట్టువారిపల్లెలో పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాభారత యజ్ఞంలో భాగంగా గురువారం నిర్వహించిన దుర్యోధనవధ ఘట్టం భక్తులను ఆకట్టుకుంది. భాగవతారణి జ్యోత్స్న మధ్యాహ్నం దుర్యోధన వధ హరికథను గానం చేశారు. వెంటటేశ్వర కళానాట్య మండలి ఆధ్వర్యంలో భీమ, దుర్యోధన పాత్రధారులు యుద్ధ ఘట్టాలను ప్రదర్శించారు. దుర్యోధనుడు మడుగులో దాక్కొని ఉండగా భీముడు అతన్ని బయటకు రప్పించి, శ్రీకృష్ణుని సాయంతో అంతమొందించిన ఘట్టాన్ని కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. వారు ఆలపించిన పద్యాలు ఆకట్టుకున్నాయి. దుర్యోధనుడి ప్రతిమ మట్టికోసం భక్తులు ఎగబడ్డారు. అంతకుమునుపు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 18 రోజుల పాటు నిర్వహించిన మహాభారత యజ్ఞం ముగిసింది. కార్యక్రమంలో పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కంకణధారులు బాబురెడ్డి, మల్‌రెడ్డి, బోయకొండ ఆలయ కమిటీ మాజీ సభ్యుడు భాస్కర్ రెడ్డి, రామాంజులు తదితరులు పాల్గొన్నారు.