
‘ఓటు’..ఇక కూతవేటు!
● ప్రతి 1,200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ● కసరత్తు చేపట్టిన జిల్లా యంత్రాంగం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులు పకడ్బందీగా కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలాచోట్ల 1,500 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఉంది. దీంవతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సిన దుస్థితి. ఎక్కువ సమయం నిలబడి ఉండలేక చాలా మంది ఓటింగ్‌కు దూరమయ్యే వారు. ఫలితంగా పోలింగ్ శాతం ఏటా తగ్గుతోంది. దీంతో ప్రతి 1,200 మంది ఓటర్లకు సమీపంలోనే ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇకపై కూతవేటు దూరంలోనే ఓటర్లకు పోలింగ్ కేంద్రం అందుబాటులోకి రానుంది.
1,200 మందికి పైగా ఉంటే..
జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,200 మందికి పైగా ఓటర్లు ఉంటే సమీపంలోని మరో పోలింగ్ కేంద్రంలోకి వారి ఓట్లు చేర్చడం లేదా కొత్తగా మరో కేంద్రం ఏర్పాటు చేసేలా అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత కేంద్రం అసౌకర్యంగా ఉంటే అందుబాటులో మరోచోట ఏర్పాటు చేసి పకడ్బందీగా మౌళిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు లోపు అన్ని నియోజకవర్గాల ఆర్‌ఓల నుంచి ప్రతిపాదనలు తీసుకుని వాటిపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
ప్రస్తుతం 1,776 పోలింగ్ కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,776 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందులో దాదాపు 268 పోలింగ్ కేంద్రాల్లో 1,200 కు పైగా ఓటర్లు ఉన్నట్లు కలెక్టరేట్ అధికారులు గుర్తించారు. పోలింగ్ కేంద్రాల మార్పులపై కసరత్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు తీసుకున్నారు. కొత్త కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు పూర్తిచేసి ముసాయిదా జాబితా తయారు చేయనున్నారు. ఎన్నికల సంఘం ఆమోదం వచ్చిన తర్వాత కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశముంది.