
‘హద్దు’లు దాటిన అక్రమాలు
తమిళనాడు సరిహద్దు ప్రాంతాలను అక్రమార్కులు అడ్డాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. అక్రమ రవాణానే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. అధికార పార్టీ నేతల అండతో యథేచ్ఛగా ఇసుక.. మట్టి దందా సాగిస్తున్నారు. ఇదే అదునుగా అంతర్రాష్ట్ర నేరగాళ్లు సైతం చెలరేగిపోతున్నారు. వరుస చోరీలతో ప్రజలను హడలెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు గంజాయి విక్రయాలను సాగిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
సాక్షి టాస్స్‌ఫోర్స్ : ప్రకృతి వనరుల రక్షణలో తమిళనాడులోని కఠినమైన నిబంధనలు మన రాష్ట్రంలో లేకపోవడంతో జిల్లా సరిహద్దు ప్రాంతాలపై అక్రమార్కుల కన్నుపడింది. హద్దు దాటిస్తే భారీ ఆదాయం వస్తుండడంతో అక్రమాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. అధికార పార్టీ అండతో ఇసుక, మట్టి తవ్వకాలు, అక్రమ రవాణా ఇష్టారాజ్యంగా సాగుతోంది.
రూ.కోట్లకు పడగెత్తిన వ్యాపారం
తమిళనాడులో ఇసుక, గ్రావెల్ తవ్వుకోవాలంటే ముందుగా కలెక్టర్, ఏడీ మైన్స్ అనుమతి తప్పనిసరి. తర్వాత ఆర్‌డీఓ, తహసీల్దార్ పర్మిషన్ సైతం పొందాలి. అయినప్పటికీ 3 నుంచి 5 అడుగుల వరకే ఇసుక తీయాలి. ప్రతి ట్రాక్టర్ ఇసుక, మట్టిపై పరదా కప్పుకునే వెళ్లాలి. వెయిటేజ్ ఎక్కువ ఉండకూడదు. అనుమతులు ఉన్నా వేకువజామున, రాత్రిళ్లు ఇసుక తవ్వకూడదు. నిబంధనలను అతిక్రమిస్తే ఇసుక తరలించే వాహనాన్ని సీజ్ చేస్తారు. క్వారీపై కేసు నమోదు చేస్తారు. అయితే మన రాష్ట్రంలో రీచ్‌ల నుంచి ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం అక్రమార్కులకు వరంగా మారింది. అధికార పార్టీ అండతో పలువురు స్మగ్లర్లు రాజంపేట చెయ్యేరు నది నుంచి రాష్ట్ర సరిహద్దులోని వీకేఆర్ పురం గ్రామానికి ఇసుక అవసరమైనట్లు బిల్లులు సృష్టించుకుని తీసుకువస్తున్నారు. ఇక్కడ చేర్చేందుకు ఎక్కడెక్కడ ఎంత ముట్టజెప్పాలో లెక్కలు తేల్చుకున్నారు. పచ్చనేతల అండతో పనగరి వరకూ ఎలాంటి అడ్డు లేకుండా ఇసుక టిప్పర్లు వచ్చేస్తున్నాయి. ఇక్కడ పక్కా ప్లానింగ్‌తో ఇసుకపై స్టోన్ డస్ట్ నింపి ఆ ముసుగులో జిల్లా సరిహద్దు దాటించేయడం మొదలు పెట్టారు. ఇలా ఒక్క టిప్పర్ తమిళనాడుకు వెళితే వచ్చే ఆదాయం రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. సరాసరిగా రోజుకు పది టిప్పర్లు హద్దు దాటినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు రూ.15 లక్షలు వస్తోంది. ఈ మేరకు నెలకు రూ.4.5 కోట్లు వెనకేసుకుంటున్రాఉ. ఈ తంతు ఏడాది పాటుగా జరుగుతుండడంతో ఇప్పటికే రూ.54 కోట్ల మేర ఇసుక తరలింపుతోనే పచ్చనేతలు, అక్రమార్కులు పోగేసుకున్నారు. ఈ నెల 13వ తేదీన ఇలా వచ్చిన టిప్పర్లను పోలీసులు పట్టుకోవడంతో అసలు బండారం బయటపడింది. వాటాల పంపిణీ వ్యవహారమే ఈ తంతును వెలుగులోకి తెచ్చిందని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
గంజాయి సైతం..
తమిళనాడులోని కాంచీపురం, తిరుత్తణి ప్రాంతాలకు నగరి మండలంలోని ఓజీ కుప్పం, మున్సిపల్ పరిధి కరకంఠాపురం నుంచి గంజాయి సరఫరా జరుగుతూనే ఉంది. తరచూ తమిళనాడుకు చెందిన గంజాయి సరఫరాదారులు పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. గంజాయి కోసం వచ్చేవారు డబ్బుల కోసం బైక్‌లో వచ్చేవారిని బెదిరించి చైన్లు లాక్కోవడం, ద్విచక్ర వాహనాలను అపహరించడం, దోపిడీలకు పాల్పడడం నిత్యకృత్యంగా మారింది. జూన్ 25వ తేదీన జిల్లా సరిహద్దు వీకేఆర్‌పురం వద్ద 2 కేజీల గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేయడం, అదే నెల 26, 30 తేదీల్లో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడే అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేయడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
రెచ్చిపోతున్న అక్రమార్కులు
అంతర్రాష్ట్ర నేరగాళ్లకు అడ్డాగా సరిహద్దు ప్రాంతాలు
యథేచ్ఛగా గంజాయి, ఇసుక, బియ్యం, గ్రావెల్ రవాణా
జాతీయ రహదారి సాకుతో..
తిరుత్తణి నుంచి పుత్తూరు వరకు జాతీయ రహదారి పనులు జరుగుతుండడం అక్రమ గ్రావెల్ వ్యాపారులకు కలిసివచ్చింది. రహదారి పనులకంటూ కొండలు, గుట్టలను శరవేగంగా కరిగించేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా తొలిచేస్తున్నారు. టిప్పర్లకు టిప్పర్లు హద్దులు దాటించి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. తిరువళ్లూరు వరకు ఒక టిప్పరు తరలిస్తే రూ.10వేల ఆదాయం వస్తుంది. ప్రతి రోజు 200 టిప్పర్లు హద్దుదాటుతోంది. ఈ నెల 15వ తేదీన తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ఆరు టిప్పర్లను తహసీల్దార్, ఎస్‌ఐ పట్టుకోవడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.