
దరఖాస్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అంటూ హంగామా
● ఓపెన్ కాని ఓఏఎమ్‌డీసీ వెబ్‌సైట్ ● దరఖాస్తు ఎలా చేయాలో అర్థం కాక విద్యార్థులు సతమతం ● అయోమయంలో కళాశాలల అధ్యాపకులు ● సింగిల్ మేజర్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ కళాశాలలకు ఉత్తర్వులు ● మళ్లీ మొదటికొచ్చిన వ్యవహారం.. ఆగస్టులోనే నోటిఫికేషన్ ● విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఉన్నత విద్యామండలి
తిరుపతి సిటీ : ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడి నాలుగు నెలలు కావస్తున్నా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టడంలో ఉన్నత విద్యామండలి విఫలమైంది. విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యావంతుల ఒత్తిడి తాళలేక ఎట్టకేలకు డిగ్రీ దరఖాస్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అంటూ హంగామా చేసి రెండు రోజుల క్రితం ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. కానీ ఇప్పటి వరకు ఆన్‌లైన్ అడ్మిషన్స్ మోడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎమ్‌డీసీ) వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అడ్మిషన్ల విధానంపై స్పష్టత లేకుండా ప్రకటన విడుదల చేసిన ఉన్నత విద్యామండలి వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో సుమారు 30 వేల మంది విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాల కోసం నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వంలో చలనం రాలేదు. డ్యుయల్ మేజర్ అంటూ అనవసర రాద్ధాంతం చేసి కమిటీ నివేదిక రావాలంటూ మూడు నెలలు కాలయాపన చేసిన ఉన్నత విద్యామండలి చివరకు చేతులెత్తేసింది. గత ప్రభుత్వం అవలంబించిన సింగిల్ మేజర్ సబ్జెక్టుతోనే అడ్మిషన్లు చేపట్టడమే ఉత్తమమని భావించి ఎట్టకేలకు ప్రకటన చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ విద్యార్థి ఆధార్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రగల్భాలు పలికింది. ఓఏఎమ్‌డీసీ వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు పొంది పరిచామంటూ ప్రకటన చేసిన ఉన్నత విద్యామండలి అడ్మిషన్ల నిబంధనలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఏమి చేయాలో పాలుపోలేని స్థితిలో విద్యార్థులు, తల్లిదండ్రులు కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు.
అడ్మిషన్లపై ప్రభావం
జిల్లాలోని ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇక డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని గ్రహించి ఇంజినీరింగ్ కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ఏడాది జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు కళాశాలలో భారీ స్థాయిలో అడ్మిషన్లు పడిపోయే ప్రమాదం ఉంది.
డిగ్రీ అడ్మిషన్లపై విద్యార్థులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఇంటర్ పాసై 4 నెలలు గడుస్తున్నా అడ్మిషన్లు చేపట్టడంలో ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా మారింది. మొన్నటి వరకు డబుల్ మేజర్ అంటూ పాట పడిన ప్రభుత్వం..మళ్లీ గత ప్రభుత్వం అవలంబించిన సింగిల్ మేజర్ విధానమే అంటూ కళాశాలలు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ప్రవేశాలు మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తుండడంతో విద్యార్థులు నిరాశకు లోనవుతున్నారు.
ఓపెన్ కాని వెబ్‌సైట్ ..
ఉన్నత విద్యామండలి అడ్మిషన్లకు అనుమతులు జారీ చేసినట్లు ప్రకటించినా ఓఏఎమ్‌డీసీ వెబ్‌సైట్ ఇప్పటి వరకు తెరుచుకోకపోవడం గమనార్హం. దీంతో డిగ్రీ కళాశాలల అధికారులు, అధ్యాపకులు అయోమయంలో పడ్డారు. వెబ్‌సైట్ ఓపెన్ అయితేగాని ప్రవేశాలపై స్పష్టత రాదని తేల్చి చెబుతున్నారు. తమకే స్పష్టత లేనప్పుడు విద్యార్థులకు ఏమని సలహా ఇస్తామని అధ్యాపకులు చెబుతున్నారు.
ఆగస్టు ఫస్ట్ వీక్‌లో నోటిఫికేషన్?
ఉన్నత విద్యా మండలి డిగ్రీలో డ్యుయల్ మేజర్ విధానం కష్టతరమని భావించి విరమించుకుంది. గత ప్రభుత్వం అవలంబించిన సింగిల్ మేజర్ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈనెల 31వ తేదీలోపు సింగిల్ మేజర్ విధానం కోసం ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఆగస్టు మొదటి వారంలో ఇవ్వనున్నట్లు సమాచారం.