బాధలు ‘బదిలీ’! | - | Sakshi
Sakshi News home page

బాధలు ‘బదిలీ’!

Jul 21 2025 5:35 AM | Updated on Jul 21 2025 5:57 AM

నగరి మండలంలోని ఓ సచివాలయంలో పనిచేస్తున్నఉద్యోగిని నిండ్ర మండలం ఆరూరుకు బదిలీ చేశారు. సదరు ఉద్యోగి అక్కడ బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లారు. అయితే ఎమ్మెల్యే నీ పేరు చెప్పలేదు...రెండు రోజులు ఆగు మాట్లాడి చెబుతా అనే సమాధానం అక్కడి ఎంపీడీవో నుంచి వచ్చింది. దీంతో ఆ సచివాలయ ఉద్యోగి నివ్వెరపోయారు. అదే విధంగా మరో ఉద్యోగి నిండ్ర మండలంలోని ఎలకాటూరుకు బదిలీ అయ్యారు. తీరా అక్కడకు వెళ్లాక నిన్ను ఎస్‌ఆర్‌పురానికి మార్చేసామంటూ ఎంపీడీఓ చెప్పడంతో నివ్వెరపోయారు. ఇంకో ఉద్యోగి నగరి మండలం కీళపట్టు నుంచి వడమాలపేట మండలంలోని ఒక సచివాలయానికి బదిలీ కాగా, విధుల్లో చేరేందుకు వెళితే ఎమ్మెల్యేని కలిసి రమ్మ, లేకుంటే ఆయన పీఏతో ఫోన్‌ చేయించమని సాక్షాత్తు ఎంపీడీఓ తెగేసి చెప్పేశారు.

ఈ తంతు ఒక్క నగరి నియోజకవర్గంలోనే కాదు. జిల్లాలోని పూతలపట్టు, యాదమరి, చిత్తూరు, పలమనేరు, జీడీ నెల్లూరు, చిత్తూరులో సైతం సాగుతోంది. నిబంధనల మేరకు బదిలీలు పొందిన సచివాలయ ఉద్యోగులు కొత్త స్థానాల్లో విధుల్లో చేరలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధుల వేధింపులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవంటూ సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా 504 గ్రామ సచివాలయాల్లో 5,040 మంది, 108 వార్డు సచివాలయాల్లో 1,080 మంది ఉద్యోగులు వివిధ కేడర్‌లలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి జూన్‌ 15 నుంచి 30 వ తేదీ వరకు బదిలీల కసరత్తు నిర్వహించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదేళ్ల పాటు విధులు నిర్వహించిన సచివాలయ ఉద్యోగులను బదిలీ చేశారు. బదిలీ అయిన వివిధ కేడర్‌ల ఉద్యోగులు జూలై 10వ తేదీలోపు కొత్త స్థానాల్లో విధుల్లో చేరిపోవాలి. అయితే పలువురు సచివాలయ ఉద్యోగులు రాజకీయ ఒత్తిడి కారణంగా ఇప్పటికీ విధుల్లో చేరలేదు.

కూటమి పాలనలో కక్ష సాధింపులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపులకు పాల్పడుతూనే ఉంది. చిరు జీతాలకు విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి కల్పించడంతో పాటు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారు. బదిలీల తంతు ముగిసి సదరు ఉద్యోగులు నూతన స్థానాల్లో చేరేందుకు వెళితే ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తున్నారు. ఎవరి అనుమతితో తమ నియోజకవర్గంలోని సచివాలయానికి వచ్చావు అంటూ ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీంవతో చాలా మంది సచివాలయ ఉద్యోగులు కొత్త స్థానాల్లో చేరలేని దుస్థితి.

నమస్తే పెట్టి వెళ్లు

కొత్త స్థానాల్లో చేరేందుకు వెళ్లిన సచివాలయ ఉద్యోగులతో ఎంపీడీఓ వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రధానంగా నగరి, పూతలపట్టు, చిత్తూరు, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లోని ఎంపీడీఓలు నేరుగా సచివాలయ ఉద్యోగులకు కాల్‌ చేసి మరీ బెదిరిస్తున్నారు. మరో వైపు ఎమ్మెల్యేల పీఏలు కాల్‌ చేసి ఒకసారి వచ్చి ఎమ్మెల్యేకు నమస్తే పెట్టి వెళ్లు అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వారి పీఏలు, ఎంపీడీఓలు ఇలా ఎవరికి వారు సచివాలయ ఉద్యోగులతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు.

సచివాలయ ఉద్యోగులతో

ఎంపీడీఓల చెడుగుడు

ఎమ్మెల్యేలను కలిసి వెళ్లాలని హుకుం

లేకుంటే తప్పని వేధింపులు

పట్టించుకోని జిల్లా యంత్రాంగం

సచివాలయ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను జారీచేసింది. కలెక్టర్‌ అనుమతితో నిబంధనలను అనుసరించి బదిలీలు చేపట్టారు. ఈ ప్రక్రియలో పలు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సులు చెల్లకపోవడంతో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వేధింపులు సరికాదు

సచివాలయ ఉద్యోగులపై రాజకీయ వేధింపులకు పాల్పడటం సరైన పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిరుద్యోగులనే టార్గెట్‌ చేస్తోంది. ఇది దుర్మార్గమైన పద్ధతి. నిబంధనల మేరకు బదిలీలు పొందిన సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సబబు కాదు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయాలి. – నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి.

బాధలు ‘బదిలీ’! 1
1/2

బాధలు ‘బదిలీ’!

బాధలు ‘బదిలీ’! 2
2/2

బాధలు ‘బదిలీ’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement