
పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో చెల్లించాలి
చిత్తూరు కలెక్టరేట్ : పెన్షనర్‌ల ఆర్థిక ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం సకాలంలో చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్ల పట్ల చిన్నచూపు చూడటం సరికాదన్నారు. పెన్షనర్‌లకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులు, జీఐఎస్ తదితర బకాయిలను సత్వరం మంజూరు చేయాలన్నారు. సెప్టెంబర్ 2024 నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ఇంత వరకు గ్రాట్యూటీ చెల్లించకపోవడం దారుణమన్నారు.
కోళ్లఫారంలో చోరీ
కార్వేటినగరం: పట్టపగలే కోళ్లఫారంలో చోరీ జరిగింది. ఈ ఘటన సోమవారం మేజర్ పంచాయతీ కార్వేటినగరం సమీపంలోని సుద్దగుంట వద్ద ఉన్న కోళ్లపారంలో చోటుచేసుకుంది. కోళ్లఫారం యజమాని సాయికుమార్ కథనం.. సుద్దగుంట సమీపంలో ఉన్న కోళ్లఫారంలో అదే గ్రామానికి చెందిన గురవయ్య, లక్ష్మీపతి, సుబ్రమణ్యం పట్టపగలే కోళ్లఫారం తలుపులు పగుల గొట్టి సీసీకెమెరాల వైయర్లను కట్ చేసి, అందులోని గ్యాస్ సిలిండర్, వంద కోళ్లు, ఇనుపరాడ్లు, ఫారంలో వాడే ఫీడర్లు దింకాలర్స్‌లను అపహరించినట్లు తెలిపారు. ఈ మేరకు సీసీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఆపై స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్టు పేర్కొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 38 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 38 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు, డీఎస్పీ సాయినాథ్ కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇందులో సైబర్‌క్రైమ్, వేధింపులు, కుటుంబ తగదాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్టు పేర్కొన్నారు. వీటిని క్షుణంగా పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
నెట్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీ, వర్సిటీలు, కళాశాలల్లో అధ్యాపక పోస్టుల నియామకంలో ప్రధాన అర్హతకు యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) ఫలితాలు సోమవారం విడుదల చేశారు. గత నెల 18 నుంచి 21వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షకు ఎస్వీయూ పరిధిలో 4,578 మంది హాజరుకాగా 52 శాతం మంది అర్హత సాధించినట్లు సమాచారం.
శ్రీవారి దర్శనానికి 14 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ నారాయణగిరి చెట్ల వద్దకు చేరుకుంది. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 14 గంటలు పడుతోంది.