
అధిక వడ్డీ పేరుతో బురిడీ!
● పలమనేరులో రూ.2 కోట్ల కుంభకోణం ● మర్కజ్‌కాంప్లెక్స్‌లో గతంలో వెలిసిన ఆఫీస్ ● అధిక వడ్డీలిస్తామంటూ భారీగా వసూళ్లు ● ఆపై కనిపించకుండా పోయిన నిర్వాహకులు
పలమనేరు: పట్టణంలో ఇటీవల ఓ కార్యాలయాన్ని అన్ని హంగులతో ప్రారంభించిన ఓ వ్యక్తి పలువురి వద్ద అధిక వడ్డీలు ఇస్తామంటూ రూ.2 కోట్లకుపైగా వసూలు చేసి మోసం చేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గతంలో ఓ వ్యక్తి స్థానిక మర్కజ్‌కాంప్లెక్స్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని అందులో ఫైనాన్స్ కంపెనీని మొదలు పెట్టాడు. ఇందులో కొత్త స్కీమ్‌లు పెట్టి పది లక్షలు డిపాజిట్ చేస్తే తాము దాన్ని షేర్లలో పెట్టి అధిక వడ్డీలు ఇస్తామని ఆశజూపాడు. దీంతో చాలామంది వీరివద్ద భారీగా డబ్బులు డిపాజిట్ చేసినట్టు తెలిసింది. ఆపై ఏమైందోగానీ ఆ కార్యాలయం మూతబడింది. నిర్వాహకుడు కనిపించకుండాపోయాడు. ఇలా ఉండగా పట్టణానికి చెందిన మసూద్ అనే బాధితుడు రూ.50 లక్షల వరకు డిపాజిట్ చేసి మోసపోయాడు. ఎలాగా సదరు నిర్వాహకుని ఆచూకీ తెలుసుకొని హైదరాబాద్‌లోని ఓ లాడ్జీలో ఉండగా వెళ్లి పట్టుకున్నాడు. ఆపై అతనిపై దాడిచేశాడు. తాను ఇచ్చిన డబ్బు తనకివ్వాలని, లేదంటే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని గట్టిగా హెచ్చరించాడు. దానికి సంబంధించిన విడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇలావుండగా ఈ మోసంపై స్థానిక పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేని తెలిసింది. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది.