
పంట పొలాలపై ఆగని గజ దాడులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలో రోజూ ఏదొ ఒకచోట పంట పొలాలపై ఏనుగులు దాడికి తెగబడుతున్నాయి. కొన్ని నెలలుగా ఇక్కడే తిష్ట వేసి పంటలను నాశనం చేస్తున్నాయి. సోమవారం ఉదయం మండలంలోని ఆవుల పెద్దిరెడ్డిగారిపల్లె, కురవపల్లె, చిట్టారెడ్డిపేట, పాతపేట పరిసర ప్రాంతాల్లో ఏనుగుల మంద పంటలను ధ్వసం చేసింది. ఆవుల పెద్దిరెడ్డిగారిపల్లెలో చామంచుల కోదండయ్య టమాట పంటను తొక్కిపడేశాయి. పశువుల మేత కోసం వేసిన గడ్డి, వరి నారును నాశనం చేశాయి. తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.
జీవన ఎరువుల పంపిణీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని రైతులకు క్షేత్రస్థాయిలో జీవన ఎరువల వల్ల కలిగే లాభాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జీవన ఎరువుల మందుల పంపిణీ, అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జీవన ఎరువులను వినియోగంచడంతో పంటలకు బలం వస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్‌వో మోహన్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు.
నర్సింగ్ ఉద్యోగావకాశాలు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ డీడీ విక్రమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని మూడు కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున జర్మన్ లాంగ్వేజ్‌లో బీఎస్సీ, జీఎన్‌ఎం నర్సింగ్‌లో డిగ్రీ పట్టా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉచిత వసతితో పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి, రెండేళ్లు క్లినికల్ అనుభవం, జీఎన్‌ఎం నర్సింగ్ పూర్తిచేసి మూడేళ్లు క్లినికల్ అనుభవం ఉన్న ఎస్సీ,ఎస్టీ మహిళలు శిక్షణకు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులను dscweotpt@ gmail. com, ddswctr@gmail.com మెయిల్ చేయాలన్నారు. ఇతర వివరాలకు 80083 59664, 8790654826, 9959534669 నెంబర్లలో సంప్రదించాలని డీడీ కోరారు.

పంట పొలాలపై ఆగని గజ దాడులు

పంట పొలాలపై ఆగని గజ దాడులు