
ప్రజల్లోకి బాబు మోసాలు
పుత్తూరు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని, అంతకంటే ఎక్కువ ఇస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా మండిపడ్డారు. ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. క్యూ ఆర్ కోడ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు. రోజా మాట్లాడుతూ ఏడాది పాలనలో చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. షూరిటీ పేరిట బాండులపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు సంతకాలు చేసి ఇచ్చారన్నారు. హామీలు అమలు చేయకపోతే ప్రశ్నిస్తానన్న పవన్‌కల్యాణ్ ఎక్కడ నిద్రపోతున్నాడో, ఏ షూటింగ్‌లో ఉన్నాడో ఎవరికీ తెలియడం లేదని ఎద్దేవా చేశారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు గల్లా ఖాళీగా ఉందని, సూపర్ సిక్స్ చూస్తుంటే భయమేస్తోందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇంటింటికి వెళ్లి సుపరిపాలన పేరిట అమలు చేసిన పథకాల గురించి చెప్పే ధైర్యం కూటమి నేతలకు ఉందా అంటూ ప్రశ్నించారు. ఇళ్ల వద్దకు వచ్చే టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీసేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.