
సత్యప్రమాణకంగా పోయిన నగలు దొరికాయి!
● రెండు వేర్వేరు ఘటనల్లో నగలు, నగదు చోరీ ● రాజనాలబండ మహిమతో లభ్యమైన వైనం
చౌడేపల్లె: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ ప్రసన్నాంజనేయ స్వామి మహిమతోనే వేర్వేరు ఘటనల్లో చోరీ అయిన సుమారు 40 గ్రాముల బంగారు నగలు, నగదు తిరిగి లభ్యమైనట్టు బాధితులు ప్రసాద్, గంగాదేవి తెలిపారు. శనివారం రాజనాలబండకు చేరుకొని స్వామివారి పాదాల చెంత నగలు, నగదును పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. వారి కథనం.. సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లె సమీపంలోని బోనమందకు చెందిన ప్రసాద్ ఇంట్లో నెల రోజుల క్రితం చోరీ జరిగింది. ఇంట్లో తెలిసిన వ్యక్తులు బీరువాలోని నగలు 25 గ్రాములు, నగదు రూ.5 వేలు చోరీచేశారు. గుర్తించిన ప్రసాద్ ఇంట్లో వారిని, చుట్టుపక్కల వారిని విచారించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెద్ద మనుషుల చేత పంచాయితీ నిర్వహించారు. రాజనాల బండలో ప్రమాణం చేయాలని తీర్మానించారు. గత శనివారం రాజనాలబండకు చేరుకొని ముందుగానే ఈ నెల 19వ తేదీ శనివారం ప్రమాణం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం ఉదయం ఇంటికొక మనిషి రాజనాలబండకు ప్రమాణం చేయడానికి బయలు దేరాల్సి ఉంది. ఇంతలో ఇంటి ఆవరణలో నగలు, నగదు ప్రత్యక్షమయ్యాయి. గుర్తించిన బాధితులు పెద్ద మనుషులకు నగల విషయాన్ని తెలిపి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకొని పూజలు చేశారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం, దిగువకృష్ణాపురం వలసపల్లెకు చెందిన గంగాదేవి ఇంట్లో సుమారు 15 గ్రాముల బొట్టుచైను రెండు వారాల క్రితం చోరీకి గురైంది. గుర్తించి ఆమె ఇంట్లో, చుట్టుపక్కల విచారణ చేపట్టింది. రాజనాలబండకు చేరుకొని ఇంటికొక మనిషి సత్యప్రమాణం చేయాలని తీర్మానించగా ఉదయాన్నే ఇంటి గుమ్మం వద్ద బొట్టు చైను ప్రత్యక్షమైంది. దీంతో ఇరు కుటుంబాల వారు స్వామివారి చెంతకు నగలను తెచ్చి పూజలు చేశారు. స్వామి మహిమతోనే పోయిన నగలు తిరిగి వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.

సత్యప్రమాణకంగా పోయిన నగలు దొరికాయి!