
ఆరోగ్య వివరాలు సేకరించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో చిన్నారుల ఆరోగ్య వివరాలను పకడ్బందీగా సేకరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఐసీడీఎస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సూపర్‌వైజర్ 150 మంది పిల్లల బరువు వివరాలను సేకరించి రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. కచ్చితమైన కొలతలు నిర్వహించాలన్నారు. గత వివరాలతో సరిపోల్చి పురోగతిని అంచనా వేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పప్పు, పాల సరఫరాలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలన్నారు. చిన్నారుల్లో ఆధార్ సమస్యలున్నట్‌లైతే సరిచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆధార్ సమస్యలు ఎక్కువగా ఉన్న మండలాలను గుర్తించి, నివేదికలు అందజేయాలన్నారు. సూపర్‌వైజర్ నిత్యం అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించాలన్నారు. కుప్పంలో ఆరోగ్య, పోషణ స్క్రీనింగ్ నాణ్యతను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.