
క్యాబేజీ అధరహో
● ప్రస్తుతం టన్ను ధర రూ.12 వేలకు పైగా ● తోటల వద్దే కొంటున్న బయటి రాష్ట్రాల వ్యాపారులు ● నెలకు ముందు టన్ను క్యాబేజీ ధర రూ.వెయ్యి మాత్రమే ● అడిగేవారు లేక తోటల్లోనే పంటను వదిలేసిన రైతులు
పలమనేరు ప్రాంతంలో వ్యాపార పంటల్లో క్యాబేజీ ఒకటి. ఈ పంటకు మొన్నటి వరకు ధర లేక.. అడిగేవారు లేక..పంట పొలాల్లోనే వదిలేశారు. ఈ పంట సాగుపై ఆసక్తి చూపలేదు. టన్ను రూ.వెయ్యి కూడా పలకని క్యాబేజీ నేడు అమాంతం రూ.12 వేలు పలుకుతోంది. దీంతో పుడమిపుత్రుడు పొంగిపోతున్నాడు.
పలమనేరు: మొన్నటి దాకా క్యాబేజీని కొనేవారు లేక పంట సాగు చేసిన రైతులు పొలంలోనే పంటను వదిలేశారు. కనీసం టన్ను రూ. వెయ్యికి ఇస్తామన్నా కొనేవారు లేకుండా పోయారు. అ లాంటి క్యాబేజీ ధర ఇప్పుడు టన్ను రూ.12 వేల కు పైమాటే. పలు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రైతుల తోటల వద్దకొచ్చి పంటను కొని తీసుకెళుతున్నారు. దీంతో ఇప్పుడు క్యాబేజీ సాగు చేసి న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పలమనేరు సాగుకు అనుకూలం
పలమనేరు ప్రాంతం శీతల వాతారణాన్ని కలిగి ఉంటుంది. ఇదే వాతారణం పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లాలోనూ ఉంది. దీంతో అక్కడి రైతులు పండించే పలు కూరగాయల పంటలను ఇక్కడి రైతులు కొన్నేళ్లుగా సాగు చే స్తున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు ఉద్యానశాఖ డివిజన్ పరిధిలో 600 హెక్టార్లలో క్యాబేజీని సాగు చేశారు.
మొన్నటి దాకా అడిగే దిక్కేలేదు
గత కొన్ని నెలలుగా క్యాబేజీ ధరలు అమాంతం తగ్గాయి. గత నెలలో టన్ను కేవలం రూ.వెయ్యికి చేరింది. పంటను కొనేవారు లేక రైతులు పంటను కోయకుండా చేలల్లోనే వదిలిపెట్టేశారు. దీంతో రైతులకు పంట పెట్టుబడి సైతం దక్కక నష్టపోవాల్సి వచ్చింది. ధరలు పడిపోవడంతో చాలామంది రైతులు క్యాబేజీ నాటడానికి భయపడ్డారు. ధైర్యం చేసి పంట సాగు చేసిన రైతులకు ఇప్పుడు లాటరీ తగిలినట్లు అయ్యింది.
నేడు తోటల వద్దే కొనుగోలు
తోటల వద్దకే వ్యాపారులు వచ్చి క్యాబేజీ పంటను కొనుగోలు చేసి, అక్కడే గ్రేడింగ్ చేసి బయటి రాష్ట్రాలకు లారీల్లో తీసుకెళుతున్నారు. ముఖ్యంగా చత్తీస్‌ఘడ్, రాయపూర్, భువనేశ్వర్, కటక్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు సరుకును తీసుకెళుతున్నారు. స్థానిక మార్కెట్లలోనూ క్యాబేజీకి మంచి డిమాండ్ నెలకొంది.
ధైర్యం చేసి పంట సాగుచేశా
మా ప్రాంతంలో క్యాబేజీ సాగు చేసి ధరల్లేక తోటల్లోనే వదిలేసిన వాటిని చూశా. కానీ చూద్దాం జూలైలో ధరలు వస్తాయనే ధైర్యంతో పంటను సాగు చేశా. ఒకటిన్నర ఎకరాలో పంటను ఒబ్బిడి చేశా. 30 టన్నుల దాకా ఉత్పత్తి వచ్చింది. ధరలు బాగుడడంతో సంతోషంగా ఉంది.
– జగదీష్, రైతు, రామాపురం,
పలమనేరు మండలం
మంచి గిట్టుబాటు ధర
నేను క్యాబేజీ పంటను నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా. గతంలో ఎప్పుడూ కిలో రూపాయికి పడిపోలేదు. కానీ ఈ దఫా సరుకు కొనేవారు లేకుండా పోయారు. దీంతో చాలామంది రైతులు క్యాబేజీని సాగు చేయలేదు. ఇప్పుడు టన్ను రూ.12 వేలు దాటింది. తోటలున్న రైతులకు మంచి గిట్టుబాటుగా మారింది. – హరి, రైతు, రామాపురం,
పలమనేరు మండలం

క్యాబేజీ అధరహో

క్యాబేజీ అధరహో