
సీపీఎస్ రద్దు చేసేవరకు పోరాడుతాం
● ఆగస్టు నుంచి పోరాటం ఉధృతం ● కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి ● సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలి ● కలెక్టరేట్ ఎదుట డీఎస్సీ 2003 టీచర్ల ఫోరమ్ ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : సీపీఎస్ రద్దు చేసేవరకు పోరాడుతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ.రమణ స్పష్టం చేశారు. ఈ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట 2003 డీఎస్సీ టీచర్ల ఫోరమ్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఆపస్, ఎస్టీయూ, టీఎన్‌యూఎస్ తదితర సంఘాలు మద్దతునిచ్చాయి. ఆయన మాట్లాడుతూ సీపీఎస్ అమలు తేదీ కంటే ముందే వెలువడిన నోటిఫికేషన్‌లో ఉద్యోగాలకు ఎంపికై ఇతర కారణాలతో ఆలస్యంగా ఉద్యోగాల్లో చేరి సీపీఎస్ పరిధిలోకి వచ్చిన టీచర్లకు న్యాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో సీపీఎస్ అమలు తేదీ 01–09–2004 కంటే ముందే ఉద్యోగానికి ఎంపికై అప్పటి ప్రభుత్వ కాలపరిమితి ముగిసి నూతన ప్రభుత్వ ఏర్పాటు వల్ల ఉద్యోగాల్లో చేరడం ఆలస్యమైందన్నారు. ఈ సమస్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 వేల మంది టీచర్లు, ఉద్యోగులు సంబంధం లేని, నోటిఫికేషన్‌లో పేర్కొనని సీపీఎస్ విధానంలోకి బలవంతంగా నెట్టబడ్డారని ఆరోపించారు. న్యాయం జరగకపోతే ఆగస్టు నుంచి పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మమ్మల్ని ఓపీఎస్ పరిధిలోకి తీసుకోండి
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటామోహన్ మాట్లాడుతూ 2003 డీఎస్సీ బాధితులను ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తప్పనిసరిగా నెరవేర్చాలన్నారు. అనంతరం ఆ సంఘ నాయకులు డీఆర్‌వో మోహన్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ 2003 టీచర్స్ ఫోరమ్ కన్వీనర్లు మోహన్, ఢిల్లీ ప్రకాష్, వెంకటేష్, మధు, శ్రీధర్, కోదండరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, నాగరాజురెడ్డి, కిరణ్‌కుమార్, మునాఫ్ పాల్గొన్నారు.