
ఆ నగదు చెల్లించండి
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో పాల్గొన్న టీచర్లకు రెమ్యునరేషన్ నగదు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు డీఈవో కార్యాలయంలో ఏడీ 2 వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు పూర్తయ్యి మూడు నెలలు అవుతోందన్నారు. ఇంతవరకు పేపర్లు దిద్దిన టీచర్లకు నగదు ఇవ్వకపోవడం దారుణమన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. జిల్లాలో బదిలీలకు ముందు ఇచ్చిన ఉద్యోగోన్నతుల్లో సోషల్, గణితం, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి ఉద్యోగోన్నతుల పోస్టులు మిగిలిపోయాయన్నారు. వెంటనే మిగిలిన పోస్టులను ఉద్యోగోన్నతి ప్రక్రియలో భర్తీ చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌యాదవ్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమల్లో వివిధ ప్రాథమిక పాఠశాలలకు నేరుగా సరఫరా చేయకుండా క్లస్టర్ కేంద్రాల్లో బియ్యం, రాగిపిండి డంప్ చేస్తున్నారన్నారు. ఇలాచేయడం వల్ల ప్రాథమిక పాఠశాలలకు క్లస్టర్ కేంద్రాల నుంచి వాటిని తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటామోహన్, సంఘ నాయకులు లింగమూర్తి యాదవ్, నరేంద్ర పాల్గొన్నారు.