
ఆస్తి కోసం భర్తపై దాడి
– తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమార్తెలు
కార్వేటినగరం: కాటికిపోయే వయసులో కక్షలు పెంచుకున్నారు. ఆస్తుల కోసం కత్తులతో దాడులదాకా దిగజారిపోయారు. ఈ ఘటన కార్వేటినగరం మండల పరిధిలో శుక్రవారం కలకలం రేపింది. స్థానికుల కథనం.. మండలంలోని కొల్లాగుంట గ్రామానికి చెందిన జయవేల్(70), రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పిల్లలకు వివాహాలయ్యాయి. వాళ్లు ఒక్కోచోట స్థిరపడి పోయారు. కుమారుడి భార్య గతంలోనే విడిపోయి ప్రస్తుతం వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో తండ్రి జయవేల్ కుమారుడికి సపోర్ట్ చేస్తూ రాగా.. తల్లి రాజేశ్వరి కోడలికి మద్దతు పలుకుతూ వస్తోంది. జయవేల్‌ఽ తమ సొంత గ్రామం కొత్తపల్లిమిట్టలో ఉన్న ఆస్తిని అమ్మి కొల్లాగుంటలో ఆస్తి కొనుగోలుచేసి భార్య పేరుతో సొంత ఇంటి నిర్మాణం చేసుకుని స్థిరపడ్డారు. ఆ ఇంట్లో నుంచి భర్త జయవేల్‌ను తరిమేయాలని భార్య రాజేశ్వరి స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే గత ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. జయవేల్‌ను చంపేస్తామంటూ భార్య బెదిరింపులకు దిగడంతో ఆయన టీవల పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ వివాదంపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. గురువారం భార్యాభర్తలిద్దరూ కోర్టుకు హాజరై వచ్చారు. అయినప్పటికీ తీరుమార్చుకోని భార్య రాజేశ్వరి గురువారం రాత్రి ఆయనతో తీవ్రంగా గోడవపడింది. ఆపై శుక్రవారం తమ బంధువులతో కలసి జయవేల్‌ను కత్తితో నరికి హత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు గుర్తించి అతన్ని 108 వాహనం ద్వారా కార్వేటినగరం సీహెచ్‌సీకి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. తండ్రిపై దాడి జరిగినట్లు సమాచారం అందుకున్న కుమార్తెలు స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.