
ఔను.. వాళ్లు ఒక్కటవుతున్నారు
భార్యాభర్తల మధ్య అంతరాలు.. చిన్న చిన్న తగవులు.. ఇంకొద్దిగా మనస్పర్థలు.. మనస్సు తట్టి హృదయాంతరాల్లోకి చూస్తే తమను తక్కువ చేశారనే భావన.. ముఖ్యంగా కుటుంబ పరిస్థితులపై అవగాహన లేమి.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం.. సమస్యలు విని సర్దుబాటు చేసే వారు లేకపోవడంతో పలు జంటలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నాయి. అలాంటి జంటల సమస్యలను పరిష్కరించి, మళ్లీ వారి కాపురాలను చక్కదిద్దుతోంది ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం. నాటి వైఎస్సార్ సీపీ పాలనలో వేసిన ఈ బీజం నేడు సత్ఫలితాలను ఇస్తోంది.
చిత్తూరు అర్బన్: మహిళల హక్కులు, దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నాటిన బీజం.. ఇపుడు వృక్షంగా ఎదిగింది. అదే ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం. నాడు దిశ స్టేషన్‌గా నామకరణం చేసి మహిళలకు అండగా నిలిచిన స్టేషన్‌ను.. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళా స్టేషన్‌గా పేరు మార్చి సేవలు అందిస్తోంది. నాటి ప్ర భుత్వంలో ఉన్న దిశ ఇపుడు పే రు మార్చినా.. అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతోంది. చిత్తూరు నగరంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో శనివారం ఎస్పీ మణికంఠ చందోలు ఈ కేంద్రం పనితీరును మీడియాకు వివరించారు.
విభేదాలు పరిష్కరించి..
చిత్తూరు నగరంలోని దర్గా కూడలిలో ఉన్న ఫ్యామిలీ కౌ న్సెలింగ్ కేంద్రం మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మహిళలు, దంపతుల సమస్యలను పరిష్కరించడమే ఈ కేంద్రం లక్ష్యం. పోలీసులతో పాటు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మానసిక నిపుణులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా శిశు సంరక్షణ విభాగం ఉద్యోగులు ఓ కమిటీగా ఉంటారు. ఇంట్లో భర్తతో గొడవలు, అత్త–మామ, వదిన–తోడికోడళ్లు.. చాలా వరకు కేసుల్లో భర్త చెబితే నేను ఎందుకు వినాలి అని భార్య.. భార్యకు గౌరవం ఇవ్వడం ఏమిటని భర్త, అత్తా–మామాల చాదస్తం పడలేకపోతున్నామని కొందరు, కోడలు సరిగా చూసుకోవడం లేదని మరికొంరు స్టేష న్ మెట్లు ఎక్కుతుంటారు. ఇలా ఎవరి నుంచైనా సమస్య లు వస్తే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం, ఫిర్యాదు ఇచ్చి కేసు నమోదు చేయడం చేసేవాళ్లు. కానీ ఈ కేంద్రంలో తొలుత వ చ్చి ఫిర్యాదు ఇచ్చినా.. ఎదుటి వ్యక్తులను స్టేషన్‌కు పిలిపిస్తా రు. ఇరుపక్షాల సమస్యలు విన్న తరువాత సమస్యకు పరిష్కారం చూపించడంతోపాటు కొద్ది సమయం కూడా ఇస్తా రు. సమస్య సమసిపోతే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండ దు.. అలా వీలుకాని పక్షంలో చట్టపరంగా ముందుకు వెళుతారు.
482 కేసుల పరిష్కారం..
ఏడాది కాలంలో ఈ కేంద్రంలో 482 ఘటనల్లో ఎఫ్‌ఐఆర్‌లు కట్టకుండా సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఆవేశంలో తలెత్తిన విభేదాలకు కొద్దిగా సమయమిచ్చి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. చిన్నపాటి అభిప్రాయ భేదాలకు దారులు చూపిస్తున్నారు. ఈ కేంద్రంలో జిల్లాకు చెందిన కేసులే కాకుండా.. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ఇతర రాష్ట్రాలకు చెందిన 52, విదేశాల నుంచి వచ్చిన మూడు కుటుంబాల్లోని విభేదాలను సైతం పరిష్కరించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 748 కుటుంబ సదస్సులు నిర్వహించి, కుటుంబంలో తలెత్తే సమస్యలు ఎలా అధిగమించాలో పాఠశాలల్లోనే పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు.
సత్ఫలితాలిస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం
వైవాహిక బంధంలో సమస్యలు తీరుస్తున్న ఖాకీలు
నాటి ప్రభుత్వంలో దిశ.. కూటమిలో మహిళాస్టేషన్
పేరు మారినా.. ప్రజలకు ఉపయోగపడుతున్న సెంటర్
శృతి మించితే..
ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రంలో వీలైనంత వరకు ఓ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నమే చేస్తారు. కానీ కొన్ని కేసుల్లో భార్యను శారీరకంగా హింసించడం, కట్నం కోసం వేధించడం లాంటివి కూడా వస్తుంటాయి. వీటిపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇలా 181 మందిపై గృహహింస కేసు నమోదుకు సూచించామని, 58 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్టేషన్‌కు వెళితే తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి శనివారం స్టేషన్‌లో సమస్యలకు కౌన్సెలింగ్ ఇస్తామన్నారు.

ఔను.. వాళ్లు ఒక్కటవుతున్నారు