
స్వచ్ఛనీటి సరఫరా ప్రభుత్వాల బాధ్యత
నగరి : ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు, ఆల్ ఇండియా బుద్దిస్టు సొసైటీ జాతీయ అధ్యక్షుడు భీమ్‌రావ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. తమిళనాడు తిరుత్తణిలో నిర్వహించిన జైభీమ్ మహానాడులో పాల్గొనడానికి వెళుతూ నగరి పట్టణంలోని దళిత సంఘాల ఆహ్వానం మేరకు శనివారం మధ్యాహ్నం బస్టాండ్ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. స్థానిక నేతలు ఆయన్ని ఘనంగా స్వాగతించారు. ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచూ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు విచ్చేస్తుంటానని తన ఆర్గనైజేషన్ బుద్దిస్టు సొసైటీ అక్కడ ఉందన్నారు. ఇటీవల రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, సమ్‌తా షైనింగ్ వెల్ అండ్ గుడ్‌డే సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లు కూడా ప్రారంభించామన్నారు. ఈ మూడు ఆర్గనైజేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పునాది వేసిందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ మూడు ఆర్గనైజేషన్లను స్థాపించడమే తన ధ్యేయమన్నారు. ఈ ఆర్గనైజేషన్లు వెనుకబడిన సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందన్నారు. ఎన్నో పార్టీలు వస్తున్నాయి అంబేడ్కర్ పేరును వాడుకుంటున్నాయని, ఆ పార్టీలకు మనం ఓటేస్తున్నామని, అయితే ఆ పార్టీ లు మన సామాజిక వర్గానికి ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎఫ్ జాతీయ అధ్యక్షులు తిరునావుక్కరసు, రాష్ట్ర అధ్యక్షులు గజేంద్ర, ఆర్‌పీఐ పార్థసారధి, బీఎస్పీ నేత ధనంజేయులు, ఉమాపతి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు బీడీ భాస్కర్, లాయర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.