
నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారి పై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
వనసంపదతో
పర్యావరణ సమతుల్యత
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షించడం అలవాటు చేసుకోవాలని 35వ ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మోనిస్ అన్నారు. ఆదివారం బెటాలియన్ ఆధ్వర్యంలో నగరంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వన సంపదతో పర్యావరణ సమతుల్యత లభిస్తుందన్నారు. క్రమేణా పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అనంతరం కేడెట్‌లకు మొక్కలు నాటడం వల్ల కలిగే ఉపయోగాలు, అటవీ రక్షణ చట్టాలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పది రోజుల ఎన్‌సీసీ శిక్షణా కార్యక్రమంలో వెపన్ ట్రైనింగ్, డ్రిల్, ఫిజికల్ ట్రైనింగ్, ఆటల పోటీల్లో గెలుపొందిన కేడెట్‌లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఓ లోకనాథన్, ఎన్‌సీసీ అధికారులు ప్రసాద్‌రెడ్డి, కార్తీక్, ధనంజేయులు, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.
ఫ్లోరోసిస్‌పై అప్రమత్తం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వ్యాప్తంగా 9 మండలాలు.. 15 గ్రామాల్లోని 34 ఆవాసాల్లో ఫ్లోరైడ్ ప్రభావం ఉందని, దీనిపై తగు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌ఓ సుధారాణి తెలిపారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆదివారం ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని జీడీ నెల్లూరు, గుడిపాల, ఐరాల, పుంగనూరు, పూతలపట్టు, తవనంపల్లి, యాదమరి మండలాల్లో అధిక ఫ్లోరైడ్ ప్రభావం ఉందన్నారు. బడులు పునఃప్రారంభమైన వెంటనే 11 ఏళ్ల లోపు పిల్లలకు డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలిటల్ ఫ్లోరోసిస్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామన్నారు. అలాగే కమ్యూనిటీ సర్వేలో స్కెలిటల్ ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న వారికి నెక్ బెల్ట్, లంబార్ బెల్ట్, వాకింగ్ స్టిక్స్, వాకర్, వీల్ చైర్స్, టాయిలెట్ చైర్స్ వంటి పరికరాలు అందజేస్తామన్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలలో వ్యాధి బారిన పడకుండా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రజలందరూ సురక్షితమైన తాగునీరు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ నాయక్ పాల్గొన్నారు.
యోగా మాస్టర్
ట్రైనర్లకు శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల యోగా కేంద్రంలో యోగా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. ఆదివారం ఈ నెల 25 నుంచి 27 వరకు జరగనున్న ఈ శిక్షణా కార్యక్రమంలో మొదటిరోజు ఆదివారం డీఆర్‌ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో యోగాతో కలిగే ఆరోగ్య లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, యోగా శిక్షకులు యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. శిక్షణలో పాల్గొన్న ట్రైనర్లు శిక్షణ అనంతరం ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పీడీలు, పీఈటీలు, యోగా శిక్షకులు మండలస్థాయిలో ప్రతి గ్రామం నుంచి వచ్చే ట్రైనర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ బాలాజీ, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, యోగా అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసనాయుడు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.