
పులిచెర్ల మండలాన్ని మదనపల్లెలో కలపొద్దు
● చిత్తూరు లేక తిరుపతి కావాలి ● టీడీపీ మండల నాయకుల డిమాండ్
పులిచెర్ల(కల్లూరు) : పులిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో కలపవద్దని సమీపంలోని చిత్తూరులేక తిరుపతి డివిజన్‌లోనే ఉంచాలని టీడీపీ మండల నాయకులు రాయవారిపల్లెలోని టీడీపీ నేత రామనాథం నాయుడు ఇంటిలో సమావేశమయ్యారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు కాని 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి రెవెన్యూ డివిజన్‌లోనే మండలాన్ని ఉంచాలని కోరారు. గతంలో పులిచెర్ల మండలం తిరుపతి డివిజన్‌లో ఉండేదని ఇప్పుడు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదనపల్లె డివిజన్‌లో కలపడం ఇష్టంలేదని దీనిపై ప్రభుత్వం, కలెక్టరుకు రాత పూర్వకంగా అభ్యంతరాలను తెలియజేస్తామన్నారు. ఒకప్పుడు పులిచెర్ల సమితి ఉండేదని ఈ సమితిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ జన్మనిచ్చిందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజల సౌకర్యం కోసం ఈ మండలాన్ని చిత్తూరు లేక తిరుపతి డివిజన్‌లో కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతామని తెలిపారు. ఈ విషయంలో కలెక్టరును కూడా కలిసి రాత పూర్వకంగా అందరూ టీడీపీ నాయకులు విన్నవిస్తామన్నారు.