
పార్టీకి ద్రోహం చేసి నీతులా?
– ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై
వెంకటేగౌడ ఫైర్
పలమనేరు : ఉండవల్లి శ్రీదేవి పార్టీకి వెన్నుపోటు పొడిచి శుద్దపూసలా నీతులు వల్లించడం సరికాదని పలమనేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వెంకటేగౌడ విమర్శించారు. తన కార్యాలయంలో ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తాడికొండలో కొత్త అభ్యర్థిగా ఆమె గెలవడం కేవలం పార్టీని చూసేగాని ఆమెను చూసి కాదన్నారు. వైఎస్సార్‌సీపీలో ముందుగా పార్టీకి ద్రోహం చేసినవాళ్లంతా నేడు మైకుల్లో సొంత పార్టీని విమర్శించడం చూస్తుంటే రేపు వీరు కూటమి నేతలను విమర్శించరనే గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. మహానాడు కోసం పలమనేరుకు వచ్చిన ఉండవల్లి శ్రీదేవికి కనీసం పలమనేరు పేరు తెలియకుండా ఇదే ఊరు అనడంతోనే ఆమె కథ అందరికీ అర్థమైందన్నారు. పింఛన్ల పెంపుపై నాడు అధినేత తప్పు చేశారని చెప్పిన ఆమె అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. 2024 ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదని తెలిసే వైఎస్సార్‌సీపీని వీడి కూటమిలో కలిశారని అది ఆమె స్వార్థం కాదా అని ప్రశ్నించారు. మొన్నటి దాకా వైఎస్సార్‌సీపీ పాలన బాగుందని కితాబిచ్చిన మీరు విధిలేక కూటమి పాలనను మెచ్చుకుంటున్నారనే విషయం టీడీపీ కార్యకర్తలకు సైతం బాగా అర్థమైందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను పట్టించుకోని చంద్రబాబును నిలదీయాల్సిందిపోయి వైఎస్సార్‌సీపీపై అవాకులు, చవాకులు మాట్లాడడం మంచిది కాదన్నారు. కడపలో జరిగే మహానాడును విజయవంతం చేసేందుకు వచ్చిన ఆమె దాన్ని చూడాలి గానీ మీకు రాజకీయ బిక్ష పెట్టిన జగన్ మోహన్‌రెడ్డిని విమర్శించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారన్నారు.