
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
● రేపు ప్రసన్న తిరుపతికి గంగమ్మకు పట్టువస్త్రాల సమర్పణ
కుప్పం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21న కుప్పం పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం ద్రవిడ వర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కుప్పం వరకు రూట్ మ్యాప్ పరిశీలించారు. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో విశ్వరూప దర్శనం పురస్కరించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు బుధవారం సీఎం కుప్పం వస్తున్నట్లు తెలిపారు. సెక్యూరిటీకి సంబంధించి వర్సిటీ గ్రౌండ్ హెలిప్యాడ్‌లో బ్యారికేడ్లు, శానిటేషన్ నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. బుధవారం ఉదయం సీఎం విజయవాడ నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ద్రవిడ వర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కుప్పం తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.అనంతరం 2.30 గంటలకు విజయవాడకు తిరుగుప్రయాణం అవుతారని అధికారులు చెప్పారు.
రైఫిల్ షూటింగ్‌పై క్యాడెట్లకు శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : క్రమశిక్షణకు మారుపేరు ఎన్‌సీసీ అని క్యాంప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ నోయల్ వివేక్ మోనిస్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు మైదానంలో నిర్వహిస్తున్న 10 రోజుల శిక్షణా కార్యక్రమంలో క్యాడెట్లకు రైఫిల్ షూటింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, లక్ష్యంపై దృష్టి, శ్వాసపై నియంత్రణ, ఆయుధంపై పట్టు మంచి ఫైరర్‌కు ఉండాల్సిన లక్షణాలు అని అన్నారు. డిప్యూటీ క్యాంప్ కమాండెట్ మేజర్ లోకనాథం మాట్లాడుతూ, ఎన్‌సీసీ శిక్షణ పూర్తి చేసి అందుకునే సర్టిఫికెట్లు క్యాడెట్లకు ఉన్నత విద్య, ఉద్యోగాలను సాధించేందుకు ఉపయోగపడుతాయన్నారు. అనంతరం ఎన్‌సీసీ ఆఫీ సర్ ప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. రైఫిల్ షూటింగ్, డ్రిల్, సరిహద్దుల్లో ఆర్మీ శిబిరాలు ఏ విధంగా ఉంటాయో క్యాడెట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు కార్తీక్, చిరంజీవి, ధనంజయులు, యుగంధర్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.