మామిడికి గిట్టుబాటు బాధ్యత ప్రభుత్వానిదే | - | Sakshi
Sakshi News home page

మామిడికి గిట్టుబాటు బాధ్యత ప్రభుత్వానిదే

May 23 2025 2:13 AM | Updated on May 23 2025 2:13 AM

మామిడ

మామిడికి గిట్టుబాటు బాధ్యత ప్రభుత్వానిదే

● తోతాపురి టన్నుకు రూ.25 వేలు ఇవ్వాలని రైతుల డిమాండ్‌ ● కలెక్టరేట్‌లో మామిడి రైతులు, ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్వాహకులతో సమీక్ష ● పాల్గొన్న రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఎంపీ, ఎమ్మెల్యేలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర బాధ్యత కూటమి సర్కారుదేనని మామిడి రైతులు పేర్కొన్నారు. జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గురువారం కలెక్టరేట్‌లో మామిడి రైతులు, ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న జిల్లాలోని మామిడి సంఘాల నాయకులు, రైతులు ఉన్నతాధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. మామిడి సంఘం నాయకులు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మామిడి కొనుగోళ్లు ఒకేసారి చేయడం వల్ల ఫ్యాక్టరీల వద్ద మామిడి రైతులు రాత్రింభవళ్లు క్యూలో ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. బంగారుపాళ్యం కు చెందిన రైతు మునీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. మామిడి పంటకు టన్నుకు రూ .25 వేలు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. తవణంపల్లి మండలానికి చెందిన రైతు పద్మనాభనాయుడు మాట్లాడుతూ.. మామిడికి విపరీతమైన ప్రచారం కల్పించిన ప్రభుత్వం ప్రస్తుతం ఎందుకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతోందన్నారు.

మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి

జిల్లాలో మామిడిబోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరు జిల్లాలో మామిడి పంట అధికంగా ఉందన్నారు. మామిడి బోర్డు ప్రతిపాదనలను సంబంధిత శాఖలకు అందజేసి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతులు, ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్వాహకులు ఇద్దరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపడుతామన్నారు. ఉద్యానవన శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మామిడి గుజ్జు, జ్యూస్‌లపై జీఎస్టీ ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ మాట్లాడుతూ.. మామిడి సీజన్‌లో తోతాపురి రకంకు గిట్టుబాటు ధర విషయంలో రైతులు, ప్రాసెసింగ్‌ కంపెనీల నిర్వాహకులు సమన్వయం ముఖ్యమన్నారు. పండ్ల పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు కట్ట మంచి బాబి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్‌ కంపెనీల్లో ఎక్కువగా గుజ్జు నిల్వ ఉందన్నారు. మామిడి గుజ్జుకు డిమాండ్‌ తగ్గిందన్నారు. సమీక్షలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్‌, మురళీమోహన్‌, భాను ప్రకాష్‌, చుడా చైర్మన్‌ హేమలత, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా జేసీలు విద్యాధరి, శుభం బన్సల్‌, ఆదర్శ రాజేంద్రన్‌, ఉద్యానవన శాఖ అధికారులు మధుసూదన్‌రెడ్డి, దశరథరామిరెడ్డి, రవిచంద్రబాబు, రైతులు పాల్గొన్నారు.

మామిడికి గిట్టుబాటు బాధ్యత ప్రభుత్వానిదే1
1/1

మామిడికి గిట్టుబాటు బాధ్యత ప్రభుత్వానిదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement