
ఉపాధికి నిచ్చెన
● పేద విద్యార్థులకు డెయిరీ టెక్నాలజీ కోర్సు వరం ● కోర్సు పూర్తి కాగానే మెండుగా ఉపాధి అవకాశాలు ● జిల్లాలో రెండు ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు ● ద్వితీయ సంవత్సరంలోనే ప్రాంగణ ఎంపికలు
విద్యార్థులకు ప్రయోగాలను నేర్పుతున్న అధ్యాపకులు
పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల
పేద విద్యార్థులకు డెయిరీ టెక్నాలజీ కోర్సు వరంగా మారింది. రెండేళ్ల కోర్సు పూర్తి కాగానే ఉపాధి అవకాశాలు లభిస్తుండడం విద్యార్థులను ఆకర్షిస్తోంది. కోర్సులో చేరేందుకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకపోవడం గ్రామీణ విద్యార్థులకు మరింత చేరువ అయింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఇప్పటికే 60 శాతం మంది ఉపాధి అవకాశాలు దక్కించుకున్నారు. పైగా స్వయం ఉపాధి పొందే వీలుంది. సొంతంగా డెయిరీ ఫాం పెట్టుకొని రాణించే అవకాశాలు ఉండడంతో మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సుతో ఉన్నత చదువులకు అవకాశం ఉండడంతో ఈ కోర్సుపై అందరికీ ఆసక్తి నెలకొంది.
పలమనేరు : పదో తరగతి కాగానే కార్పొరేట్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదివించి ఆపై నీట్, ఎంసెట్ ద్వారా ఉన్నత చదువులు చదివించలేని పేద తల్లిదండ్రులకు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశపెట్టిన రెండేళ్ల డెయిరీ టెక్నాలజీ కోర్సుతో వెంటనే ఉద్యోగాలు పొందేందుకు ఓ వరంలా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఈ కోర్సుపై చాలా మందికి అవగాహన లేదు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రమే ప్రస్తుతం ఈ కోర్సు అందుబాటులో ఉంది.
ఎటువంటి పరీక్ష లేకుండానే ప్రవేశం
శ్రీపదిశ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండానే డెయిరీ టెక్నాలజీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఒక్కో కళాశాలలో 40 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ కోర్సును పూర్తి చేస్తే వెటర్నరీశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు వెళ్లవచ్చు. ఇక జిల్లాలో పాలపరిశ్రమ జోరందుకుంది. దీంతో పలు ప్రైవేటు పాల డెయిరీలున్నాయి. ఇందులో టెక్నీషియన్ ఉద్యోగాల కోసం పలు కంపెనీలు ద్వితీయ సంవత్సరంలో ఉండగానే కళాశాలలో ప్రాంగణ ఎంపికలు చేస్తున్నారు. ఉన్నత చదువులకు వెళ్లాలంటే బీఎస్సీ (డెయిరీ సైన్సు)లోనూ చేరవచ్చు. ఇందులో డిగ్రీ పూర్తయిన వారికి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు దక్కుతాయి. వీటికి వేతనాలు భారీగానే ఉంటాయి. కోర్సు పూర్తి చేసిన వారికి పశుసంవర్ధకశాఖలో ఉద్యోగా అవకాశాలుంటాయి.
గ్యారెంటీగా ఉపాధి అవకాశాలు
పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కోర్సును 2015–16లో ఏర్పాటు చేశారు. ఇప్పటి దాకా ఈ కోర్సు పూర్తి చేసిన వారిలో 60 శాతం మందికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని పాల డెయిరీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మిగిలిన వారిలో కొందరు ఉన్నత చదువులకెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేటులో ఉపాధి లేకున్నా సొంతంగా డెయిరీ ఫాం పెట్టుకొని స్వయం ఉపాధి పొందే అవకాశం ఉన్న కోర్సు కారణంగా దీనికి మంచి డిమాండ్ ఉంది.
కోర్సు చదువుతుండగానే ఎంపికలు
గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు ఈ కోర్సు నిజంగా వరంలాంటిది. కోర్సు చదువుతుండగానే ఉద్యోగాలిస్తామంటూ పాల డెయిరీలు ముందుకొస్తున్నాయి. వెటర్నరీ పాలిటెక్నిక్‌లో చేరాలంటే ఎంట్రన్స్ రాయాలి. కానీ ఇందులో నేరుగా ప్రవేశం పొందవచ్చు. పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
– గురుప్రసాద్‌రెడ్డి, డెయిరీ టెక్నాలజీ కోర్సు ఇన్‌చార్జి, పలమనేరు
కోర్సు పూర్తి కాగానే ఉద్యోగం
మాది పలమనే రు మండలంలో ని సముద్రపల్లి గ్రామం. పేద కు టుంబం కావడంతో ఉన్నత చదు వులకు వెళ్లలేదు. దీంతో డెయిరీ టెక్నాల జీ కోర్సులో చేరా. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించా. ఈ గ్రామానికి పక్కనే ఉన్న పరాగ్ డెయిరీలో ప్రసుత్తం ల్యాబ్ లో టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తున్నా.
– లవకుమార్, టెక్నీషియన్, పరాగ్ డెయిరీ, పలమనేరు
ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో చేరాను
మాది తవణంపల్లి మండలం గాజులపల్లి. మా తండ్రి రవి ట్రాక్టర్ డ్రైవర్, తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.డెయిరీ టెక్నాలజీ కోర్సు చేస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుందని తెలుసుకున్నా. డెయిరీ టెక్నాలజీ కోర్సు పూర్తి చేశా. మొన్నటి ఫలితాల్లో 971 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకు సాధించా. చదువుతూ ఉండగానే ఉద్యోగాలకు ఎంపిక కావాలన్నదే లక్ష్యం.
– హర్షిత, డెయిరీ టెక్నాలజీ కోర్సులో స్టేట్ టాపర్

ఉపాధికి నిచ్చెన

ఉపాధికి నిచ్చెన

ఉపాధికి నిచ్చెన

ఉపాధికి నిచ్చెన

ఉపాధికి నిచ్చెన