
ప్రైవేటు కళాశాలలపై నిఘా
ఎంత కట్టడి చేసినా ఏటా అనుమతులు లేని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మరో 11 రోజుల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న ప్రభుత్వ కళాశాలల కసరత్తుపై ఇంటర్మీడియట్ ఆర్జేడీ, డీఐఈవో డా.ఆదూరు శ్రీనివాసులతో సాక్షి ముచ్చటించింది.. వివరాలు ఆయన మాటల్లోనే..
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటికే అడ్మిషన్‌ల ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాది కంటే రానున్న విద్యాసంవత్సరంలో అడ్మిషన్‌ల పెంపునకు పకడ్బందీగా కసరత్తు చేపడుతున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, వసతులు, కోర్సులు, మధ్యాహ్న భోజనం, అనుభవం ఉన్న అధ్యాపకులు తదితర సౌకర్యాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం జరుగుతోంది. ప్రభుత్వ కళాశాలల్లోని ప్రతి ప్రిన్సిపల్ తమ వంతు బాధ్యతగా అడ్మిషన్‌ల పెంపుపై ప్రత్యేక ఫోకస్ చేయాలని ఆదేశించాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు పోటీ పరీక్షలకు పోటీ పడేలా ఈ విద్యా సంవత్సరం నీట్, జేఈఈ, ఎంసెట్, తదితర పరీక్షలకు మెటీరియల్, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
తొలిరోజే పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఉన్న ప్రతి కళాశాలలో తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే మండలాలకు పాఠ్యపుస్తకాలు, మెటీరియల్‌లు చేరాయి. కొన్ని కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థుల చెంత పాఠ్యపుస్తకాలు లేవు అనే మాట రాకుండా పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని ఏ ప్రభుత్వ కళాశాలలోనూ పాఠ్యపుస్తకాలు నిల్వ పెట్టుకోకుండా నిబంధనల ప్రకారం విద్యార్థులకు పంపిణీ చేసేయాలని ఆదేశాలిచ్చాం.
68 మంది ప్రిన్సిపల్స్, 400 అధ్యాపకులు బదిలీ
రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు బదిలీల కసరత్తు పకడ్బందీగా చేపడుతున్నాం. ప్రస్తుతం అంతర్గతంగా కసరత్తు చేపడుతున్నాం. బదిలీ ఉత్తర్వులు విడుదలైన తర్వాత ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఖాళీలు, పోస్టుల వివరాలను నమోదు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 68 మంది ప్రిన్సిపల్స్, 400 మంది అధ్యాపకులు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఉత్తర్వులు జారీ అయ్యాక ఖాళీలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తాం. వాటి ప్రకారం ఆన్‌లైన్ విధానంలో బదిలీలు నిర్వహించడం జరుగుతుంది.
అనుమతుల్లేని కళాశాలలుంటే సీజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి కృషి పకడ్బందీగా బదిలీల ప్రక్రియ పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ జూన్ 2న జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం సాక్షి ఇంటర్వ్యూలో ఇంటర్మీడియట్ ఆర్జేడీ, డీఐఈవో డా.ఆదూరు శ్రీనివాసులు
మేనేజ్‌మెంట్‌ల వారీగా కళాశాలలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 31
హైస్కూల్ ప్లస్ 24
కేజీబీవీ 08
సోషల్ వెల్ఫేర్ గురుకులాలు 04
బీసీ వెల్ఫేర్ గురుకులాలు 01
ఏపీ మోడల్ స్కూల్స్ 07
ప్రైవేట్ , కార్పొరేట్ 65
మొత్తం కళాశాలలు 140
జూన్ 2న పునఃప్రారంభం
జూన్ 2 వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు సంబంధించి 140 కళాశాలలుండగా, అందులో 65 ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలున్నాయి. కళాశాలలు ప్రారంభం అయ్యాక ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఎక్కడైనా కళాశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లలను అడ్మిషన్‌లు చేసే సమయంలో కళాశాలకు అనుమతులున్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కళాశాలల్లో చేర్పించాలి.

ప్రైవేటు కళాశాలలపై నిఘా