
మృగరాజుపై వేణుగోపాలుడు
కార్వేటినగరం : కార్వేటినగరం టీటీడీ అనుబంధ వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి కాళ సర్పంపై నృత్య వేణుగోపాలుడుగా ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరారు. ఉదయం సింహ వాహనంపై వేణుగోపాలుడు భక్తులను అనుగ్రహించారు. తెల్లవారు జామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు నరసింహ అవతారంలో స్వామివారు సింహ వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం 10 గంటల నుంచి 11 గంటల మధ్య రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులకు వేదపండితులు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం శ్రీకృష్ణ అవతారంలోని శ్రీవేణుగోపాలుడికి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో టీటీడీ బృందం గాత్ర కచేరి తో కనులపండువగా ఊంజల్‌సేవ నిర్వహించారు.
ఉభయ నాంచార్లుతో వేణుగోపాలుడు
వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి రుక్మిణీ సత్యభామ సమేతుడై శ్రీవేణుగోపాలుడు ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరి చిన్నారుల కోలాటాలు, మహిళల చెక్కభజనల, మంగళ వాయిద్యాలు, నడుమ అత్యంత వైభవంగా పురవీధుల్లో ఊరేగారు. భక్తులు ఇంటింటా కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవతో స్వామి వారిని పవళింప జేశారు. కార్యక్రమంలో ఏఈఓ రవి, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఆలయ అధికారి సురేష్‌కుమార్, షరాబ్ బాబు సురేష్, కంకణభట్టర్ తరుణ్‌కుమార్, వేద పండితులు నారాయణదాసరథి, గోపాలాచార్యులు, రమేష్, శభరీష్, అలంకార పండితులు మోహన్‌బట్టాచార్యులు టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు కల్యాణోత్సవం
కార్వేటినగరంలో జరుగుతున్న రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామి ఊరేగనున్నారు. ఈ క్రమంలో ఆలయంలో సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి సురేష్‌కుమార్ చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి సర్వభూపాల వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.

మృగరాజుపై వేణుగోపాలుడు