
పలమనేరుకు చేరుకున్న కుంకీ ఏనుగులు
పలమనేరు : కర్ణాటక ప్రభుత్వం నుంచి పలమనేరు మండలంలోని కాలువపల్లి వద్ద నిర్మించిన ఎలిఫెంట్ క్యాంపునకు నాలుగు ఏనుగులు వచ్చినట్లు స్థానిక ఎఫ్‌ఆర్వో నారాయణ బుధవారం తెలిపారు. ఆ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో వీటిని స్వీకరించారు. ఈ కుంకీ ఏనుగుల పేర్లు రంజని, దేవా, కృష్ణా, అభిమన్యు ఉన్నాయి. వీటి సంరక్షణకు ఇక్కడి క్యాంపులో అవసరమైన మేతను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల కర్ణాటక మావటీలు స్థానిక రేంజిలో శిక్షణ పొందిన మావటీలు వీరి పర్యవేక్షణలో ఉంటారని అధికారులు తెలిపారు.
మామిడి దిగుబడిపై
నివేదిక ఇవ్వాలి
తవణంపల్లె : మామిడి దిగుబడిపై అంచనా వేసి నిర్ధిష్టమైన నివేదిక ఉంచాలని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్‌రెడ్డి రైతు సేవా కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మండలంలోని పుణ్యసముద్రం రైతు సేవా కేంద్రంలో మామిడి దిగుబడి అంచనాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సేవా సిబ్బంది పరిధిలోని రైతులను కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి మామిడి దిగుబడి ఎన్ని టన్నులు వస్తుందని అంచనా వేసి నివేదిక తయారు చేయాలని సూచించారు. సీజన్ ప్రారంభం కాక ముందే ప్రణాళిక తయారు చేసే నివేదిక చాలా ఉపయోగపడుతోందని వివరించారు. అనంతరం ఫీల్ ఫ్రెష్ ఫుడ్ ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. నిల్వ ఉన్న మామిడి కాయలను, ఫ్యాక్టరీని పరిశీలించి ఫల్ప్ తయారీపై ఆరా తీశారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి సాగరిక, మండల వ్యవసాయాధికారి జి. ప్రవీణ్, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ ఏటీజిహెచ్ వద్దకు చేరింది. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,000 మంది స్వామివారిని దర్శించుకోగా 31,766 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.07 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

పలమనేరుకు చేరుకున్న కుంకీ ఏనుగులు