డీసీహెచ్‌ఎస్‌లో వర్గపోరు | - | Sakshi
Sakshi News home page

డీసీహెచ్‌ఎస్‌లో వర్గపోరు

May 22 2025 1:08 AM | Updated on May 22 2025 1:08 AM

డీసీహెచ్‌ఎస్‌లో వర్గపోరు

డీసీహెచ్‌ఎస్‌లో వర్గపోరు

● జిల్లా ఆస్పత్రిని తాకిన సెగ ● అంతా తానై వ్యవహరిస్తున్న ఇద్దరు అధికారులు ● ఇష్టానుసారంగా డెప్యూటేషన్లు రద్దు ● కలెక్టర్‌, కమిషనర్‌ ఉత్తర్వులు బేఖాతరు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : డీఎసీహెచ్‌ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు వర్గపోరు పుంజుకుంటోంది. ఈ ప్రభావం డీహెచ్‌ (జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి) కార్యాలయంపై పడింది. ఆ ఇద్దరు అధికారులు కలిసి అంతా తామై చక్రం తిప్పుతున్నారు. ఇష్టానుసారంగా డెప్యుటేషన్లు రద్దు చేయడం..ఆ తప్పులను డీసీహెచ్‌ఎస్‌, కమిషనర్‌ మీదకు నెట్టేస్తున్నారు. కలెక్టర్‌, కమిషనర్‌ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ...ఉద్యోగులు, సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారు.

భయపడుతున్న అధికారులు, సిబ్బంది..

జిల్లా వైద్యవిధాన పరిఽషత్‌ పరిధిలో ఒక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, నాలుగు ఏరియా ఆస్పత్రులు, 8 సీహెచ్‌సీలున్నాయి. ఈ పరిధిలో సుమారు 500 మందికి పైగా పనిచేయగా డెప్యుటేషన్‌లో 40 మంది ఉన్నారు.. వీరిలో వర్గపోరు తారస్థాయి చేరుకుంది. ప్రధానంగా ఏఓ, ఏడీ పోస్టులు ఖాళీ అయిన దగ్గర నుంచి ఈ వర్గపోరు ఉధృతమైంది. డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి అంతా తాను చెప్పినట్లే జరగాలని ఈ పోరుకు ఆజ్యం పోస్తున్నారు. రాష్ట్ర కమిషనర్‌ శాఖలో పనిచేశానని గొప్పలు చెప్పకుంటూ..రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అందరూ తనకు సుపరిచితులే అంటూ భయపెడుతున్నాడని కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు వాపోతున్నారు. ఇటీవల డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఏఓ పోస్టుకు ఇద్దరు అధికారులు పోటీ పడ్డారు. కానీ ఆ అధికారి పుంగనూరులో పనిచేస్తున్న ఓ అధికారిని ఏఓ పోస్టుకు తెచ్చుకోవాలని గట్టి ప్రయత్నాలు చేశారు. తొలుత ఏడీ కుర్చీలో కూర్చోబెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇది ఫలించకపోగా..ఏఓ కుర్చీకి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇటీవల డీసీహెచ్‌ఎస్‌కు అనుకూలమైన ఓ అధికారి ఏఓ బాధ్యతలను చేపట్టారు. ఇది గిట్టక కార్యాలయంలో గందరగోళం సృష్టించాలని, డీసీహెచ్‌ఎస్‌కు చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ అధికారుల వర్గం పావులు కదుపుతోంది.

ఎలాంటి ఆర్డర్లు లేకుండానే..

కుటుంబ, ఆరోగ్య పరమైన కారణాలతో కలెక్టర్‌, కమిషనర్‌ అనుమతితో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. వారిని పనిచేస్తున్న స్థానం నుంచి రిలీవ్‌ చేయాలన్న రాష్ట్ర అధికారుల ఉత్తర్వులు ఉండాలి. అయితే డీసీహెచ్‌ఎస్‌, డీహెచ్‌ కార్యాలయంలో అవేవీ చెల్లుబాటు కావడంలేదు. ఓ వర్గం అధికారి చెబితేనే జిల్లాలోని ఆస్పత్రుల్లోని సూపరింటెండెంట్‌లంతా వణుకుతున్నారు. లేకుంటే ఆ అధికారి రాష్ట్ర కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తారనే భయం ప్రతి ఒక్కరిలోనూ వెంటాడుతోంది. కమిషనర్‌ ఆర్డర్లు లేకపోయినా..జిల్లాలో ఆ అధికారే జిల్లాకు డీసీహెచ్‌ఎస్‌, కమిషనర్‌ లెక్క పనిచేస్తున్నారని కార్యాలయ అధికారులు వాపోతున్నారు. ప్రధానంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిని టార్గెట్‌ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కార్యాలయంలోని మరో అధికారితో చేతులు కలిపి ఈ డెప్యుటేషన్లు రద్దుకు పూనుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అది కూడా వాళ్ల వర్గానికి మాత్రమే ఆ డెప్యుటేషన్లను పరిమితం చేశారని పలు విమర్శలకు తావిస్తోంది. వీటిపై విచారణ చేపడితే ఆ అధికారి అక్రమ బాగోతాలు బయట పడుతున్నాయని చెబుతున్నారు. వీరిపై రాష్ట్ర, జిల్లా అధికారులకు కూడా పలు ిఫిర్యాదులు వెళ్లాయి. డెప్యూటేషన్ల రద్దుపై అధికారులను ప్రశ్నిస్తే మాకేం సంబంధం లేదంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. డీసీహెచ్‌ఎస్‌ నోటి మాటగా చెప్పడంతో చేశామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అధికారి బదులిచ్చారు.

డెప్యుటేషన్‌ రద్దు తెలియదు

డెప్యుటేషన్‌ రద్దు ఎప్పడు చేయమన్నాను. నేను ఎప్పుడూ చెప్పలేదు. ఏవైనా ఆర్డరు పెట్టండి కనుక్కుంటా. ఈ ఆర్డర్‌తో నాకు సంబంధం లేదు. అది ఆస్పత్రి వాళ్లు ఇచ్చుకున్నారు. విచారిస్తాను. చర్యలు తీసుకుంటా.

– పద్మాంజలి, డీసీహెచ్‌ఎస్‌, చిత్తూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement