
సర్వర్ పరేషాన్
● రేషన్‌కార్డు దరఖాస్తుకు మొరాయిస్తున్న సర్వర్ ● సచివాలయ సిబ్బంది సతమతం ● గందరగోళంగా దరఖాస్తుల ప్రక్రియ ● మ్యారేజ్ సర్టిఫికెట్ వద్దన్నా..పలుచోట్ల వేధింపులు ● పట్టించుకోని పౌరసరఫరాల శాఖ అధికారులు
రేషన్‌కార్డుకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు
రకం సంఖ్య
చిరునామా మార్పు 235
ఆధార్ సీడింగ్ కరెక్షన్ 287
సభ్యుల చేర్పు 13769
సభ్యుల తొలగింపు 301
కొత్త రేషన్‌కార్డు 1939
కార్డు విభజనకు 1528
సరెండర్ కార్డు 41
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కొత్త రేషన్‌కార్డుల సర్వర్లు పనిచేయకపోవడంతో సచివాలయ సిబ్బంది సతమతం అవుతున్నారు. దరఖాస్తు కోసం కార్డుదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షిస్తున్నారు. తొలి నుంచి సర్వర్ సమస్య వెంటాడుతున్నా పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలున్నాయి. కొత్తగా రేషన్‌కార్డు కావాలని దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వం వద్దన్నా.. పలుచోట్ల సచివాలయ సిబ్బంది మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలని నిబంధన పెడుతున్నారు. దీంతో కార్డుదారుల దరఖాస్తు ప్రక్రియ ప్రహసనంగా మారింది.
18,100 దరఖాస్తులు
కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల ప్రక్రియకు ఈనెల 7వతేదీ నుంచి ప్రారంభమైంది. ఏడాది కాలంగా కొత్త రేషన్ కార్డుల జారీ లేకపోవడం, రేషన్ కార్డులు చేర్పులు, తొలగింపులు వంటివి పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రేషన్‌కార్డుల జారీకి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అర్జీదారులు గ్రామవార్డు సచివాలయ సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి. ఈనెల 15వ తేదీ నుంచి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెప్పినా..అమల్లోకి రాలేదు. దీంతో రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు అవస్థలు పడుతున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుకు సంబంధించి ఇప్పటి వరకు 18,100 దరఖాస్తులు వచ్చాయి.
ఒంటరి మహిళల దరఖాస్తులపై ఆంక్షలు
సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో జిల్లాలో అర్జీదారులు సచివాలయాల చుట్టూ తిరగడమే సరిపోతుంది. సర్వర్ సరిగ్గా పనిచేస్తే ఈపాటికి రేషన్ కార్డులు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి ఉండేది. సర్వర్ సమస్య తట్టుకోలేక కొన్ని ప్రాంతాల్లో త్వరపడి సచివాలయ సిబ్బంది దరఖాస్తులను తీసుకోవద్దని వీఆర్వోలు ఆదేశాలు జారీ చేశారు. జూన్‌లో కొత్త రేషన్ కార్డులు మంజూరు ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రకటించారు. సర్వర్ సమస్యతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ సాగుతూ ఉండటంతో ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తున్నా నిరాశే ఎదరువుతోంది.
ముఖ్యంగా వివాహమై భర్తకు ఏళ్ల తరబడి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరగడం లేదు. విడాకులకు సంబంధించిన వివరాలు ఉండాలంటూ చెబుతున్న పరిస్థితి నెలకొంది. భర్త నుంచి దూరమమై అనేక మంది మహిళలు ఒంటరిగా పిల్లలతో జీవిస్తున్నారు. విడాకుల కోసం తిరగలేక ఆర్థిక స్తోమత లేక అలాగే ఉండిపోయారు. ఇలాంటి ఒంటరి మహిళలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించకుండా ఆంక్షలు విధించటం ఏమిటని విమర్శలు వెల్లువెత్తున్నాయి.
వివాహ పత్రానికి మినహాయింపు ఏదీ..
రేషన్‌కార్డుదారులకు దరఖాస్తు చేసుకుంటున్న కొత్త జంటలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పటి వరకు తల్లిదండ్రుల కార్డుల్లో సభ్యులు కొనసాగుతున్న వారు కొత్తకార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీనికి మొదట్లో ప్రభుత్వం ఆధార్, పాతరేషన్‌కార్డుల నకలు, వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేసింది. దీంతో అనేక మంది ప్రస్తుతం వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకునేందుకు నానా పాట్లు పడ్డారు. నోటరీ, పెళ్లి శుభలేక, పెళ్లి సమయంలోని ఫొటోలు, వంటి తదితర వివరాలు కచ్చితంగా ఉండాలని కోరడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుభలేఖలు లేనివారు ప్రింటింగ్ ప్రెస్‌లకు పరుగులు పెట్టారు. ఆ తర్వాత పెళ్లి పత్రాలు రావడానికి ఆలస్యమవుతుందని గుర్తించిన ప్రభుత్వం వివాహ ధ్రువీకరణ పత్రం విషయంలో మినహాయింపు ఇచ్చింది. అయితే పలు చోట్ల సచివాలయ సిబ్బంది పెళ్లి పత్రాల తప్పనిసరి అంటూ మెలిక పెడుతున్నారు.
ఇబ్బందులు కలిగించొద్దు
కొత్తగా వివాహం అయిన జంటలకు వివాహ పత్రం అవసరం లేదు. దీనిపై పూర్తి స్థాయిలో సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇస్తాం. వాళ్లను ఇబ్బంది పెట్టవద్దని చెబుతున్నాం. ఎక్కడైనా అలాంటి సమస్యలు వస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చు. రేషన్ కార్డు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మి మోసపోవద్దు. అర్హత ఉంటే కచ్చితంగా కార్డులు వస్తాయి. సర్వర్ సమస్య త్వరలో పరిష్కారమవుతుంది.
– శంకరన్ డీఎస్‌ఓ, చిత్తూరు
అవగాహన లేక..
కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రారంభ సమయంలోనే ఆయా సచివాలయాల సిబ్బందికి అవగాహన శిబిరాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. అలా జరిగి ఉంటే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు దరఖాస్తులు వచ్చేవి. కొన్ని ప్రాంతాలలో కులం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్, కోరుతున్నారు. అదే సమయంలో గతంలో రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులను తొలగిస్తేనే, వారు పెళ్లి అనంతరం వారి ప్రత్యేక కుటుంబంతో దరఖాస్తు చేసుకోవటానికి వెసులుబాటు జరుగుతుంది. అలా చేర్పులు, మార్పులు తొలగింపులకు, సర్వర్ల ప్రక్రియ సక్రమంగా పనిచేయక అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయ సిబ్బందికి అర్జీదారులకు వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగంలో ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో ప్రారంభంలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కొత్తగా సభ్యుల చేరిక మొదలుకుని ఇప్పటికే మృతి చెందిన, వివాహమై వెళ్లిపోయిన సభ్యుల వివరాలను మార్చడం లేదు. దరఖాస్తు దారులకు సమయం పొడిగించాలని, సర్వర్ల సమస్యను పరిష్కరించాలని, దరఖాస్తుకు జత పరచాల్సిన వివరాలను సచివాలయాల వద్ద అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

సర్వర్ పరేషాన్