మొత్తం చెల్లిస్తేనే రెన్యూవల్‌ అంటూ వేధింపులు | - | Sakshi
Sakshi News home page

మొత్తం చెల్లిస్తేనే రెన్యూవల్‌ అంటూ వేధింపులు

May 22 2025 5:44 AM | Updated on May 22 2025 5:44 AM

మొత్త

మొత్తం చెల్లిస్తేనే రెన్యూవల్‌ అంటూ వేధింపులు

● బ్యాంకు అధికారుల కొర్రీలు ● వ్యవసాయ, బంగారు రుణాలకు రెన్యూవల్‌ కష్టాలు ● పూర్తిగా డబ్బులు చెల్లించాలంటూ మెలిక ● అవస్థల్లో అన్నదాతలు ● ప్రభుత్వ తీరుపై మండిపాటు

వ్యవసాయ రుణం రణంగా మారింది. బ్యాంకర్లు రైతులకు అనేక కొర్రీలు పెడుతున్నారు. వ్యవసాయం, బంగారు ఆభరణాల పేరుతో రైతులు, రుణదారులు తీసుకున్న రుణాలకు రెన్యూవల్‌ కష్టాలను తెచ్చి పెట్టారు. పూర్తిగా డబ్బులు చెల్లిస్తేనే రెన్యూవల్‌ అంటూ మెలిక పెడుతున్నారు. పూర్తిగా చెల్లించి రెన్యూవల్‌ చేసుకోవాలని చెబుతుండడంతో రైతులు, రుణదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో కొందరు రైతులు అప్పులు చేసి రెన్యూవల్‌ చేస్తే..మరికొందరు పరేషాన్‌ అవుతున్నారు. ఈ విధానంపై పలువురు రైతులు మండిపడుతున్నారు.

35 లక్షల ఖాతాలు

జిల్లాలో 232 బ్యాంకులున్నాయి.. వీటికి కింద సుమారు రూ.35 లక్షల ఖాతాలున్నట్లు అధికారుల అంచనా. వీరు కొన్ని వేల కోట్లు అప్పులు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో వ్యక్తిగత, వ్యవసాయం, బిజినెస్‌, గృహ, వాహన సంబంధిత వాటి కోసం బ్యాంకుల్లో రుణాలు పొందారు. వీటి చెల్లింపులో వ్యకిగత రుణాలకు మినహాయింపులు ఇస్తున్నారు. అయితే వ్యవసాయ ఆధారిత రుణాల విషయంలో బ్యాంకర్లు చిన్నచూపు చూస్తున్నారు. రెన్యూవల్‌ పేరుతో వేధిస్తున్నారు.

గతంలో రెన్యూవల్‌ ఇలా..

గతంలో బ్యాంకుల్లో వ్యవసాయ, బంగారు రుణాలకు రెన్యూవల్‌కు వెళ్తే ఇబ్బందులు పెట్టేవారు కాదు. వడ్డీ వరకు చెల్లించుకుని రెన్యూవల్‌ చేసేవారు. లేకుంటే భూ విలువ, బంగారు విలువ ప్రకారం తీసుకున్న బ్యాంకు రుణానికి ఏటా 5 నుంచి 10 శాతం వరకు పెంచుతూ వడ్డీ జమ చేసుకునే వారు. ఇలా రైతులకు ఇబ్బందులు లేకుండా రెన్యూవల్‌ సదుపాయం కల్పించేవారు. ఈ ఫలితంగా బ్యాంకర్లకు రుణదారుల నుంచి రెన్యూవల్‌ చేయించే విషయంలో సమస్యలు తల్తెతేవి కావు. ఈ ప్రక్రియ గంట, గంటన్నర వ్యవధిలోనే జరిగిపోయేది. ఇప్పుడు అలా కాకుండా వ్యవసాయ రైతులు, రుణదారులకు సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు.

ఏటా నష్టాలు.. అప్పులే

వ్యాపార లావాదేవీలు, వ్యవసాయం పేరుతో తక్కువ వడ్డీకి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వడ్డీ వ్యాపారులు చేసుకుంటున్నవారు 30 శాతం మంది ఉన్నారని అంచనా. అలాగే 70 మంది మాత్రం వ్యవసాయ పనులు నిమిత్తం, బతుకు తెరువు కోసం పట్టాపాసు పుస్తకాలు, బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో కుదవపెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఆ రుణాల ద్వారా వ్యవసాయ వృద్ధి చేసుకుంటున్నారు. బోరు వేసుకోవడం, కొత్త రకం పంటలు పండించడం, మామిడి మొక్కలు పెట్టించడం, వరి, లేకుంటే ఏటా మామిడికి సాగుకు అవసరమ్యే ఖర్చులను భరించేందుకు బ్యాంకుల్లో అప్పులు చేస్తున్నారు. ఆపై వాటిని విడిపించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. పంట బాగా పండి..మంచి ధర ఉంటే రైతు వాటిని విడిపించుకునేందుకు వెనకడుగువేయడంలేదు. ప్రకృతి కాటేయడంతో ఏటా కష్టాలు,..కన్నీళ్లు మిగలడం లేదు. దీనిపై ప్రభుత్వం స్పందించి రెన్యూవల్‌ విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

రైతు భరోసా కేంద్రానికి విత్తనాల కోసం వచ్చిన రైతులు (ఫైల్‌)

వ్యవసాయ రుణ వివరాలు ఇలా..

సీజన్‌ రుణ లక్ష్యం ఇచ్చిన రుణం

(రూ. కోట్లలో) (రూ. కోట్లలో)

ఖరీఫ్‌–2024 4,072 4,435

రబీ–2024–25 2,830 3,120

మొత్తం 9,602 7,555

టర్మ్‌లోన్లు 3,284 3,341

రైతన్నలకు రుణాల రెన్యూవల్‌ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఏటా బ్యాంకుల్లో రుణాలకు వడ్డీ చెల్లించుకొని రెన్యూవల్‌ చేసేవారు. కొత్త నిబంధనల పేరుతో బ్యాంకర్లు రుణాలు మొత్తం చెల్లిస్తేనే రెన్యూవల్‌ అంటూ మెలిక పెట్టడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో రుణాలు మొత్తం ఎలా చెల్లించాలో తెలియక .. ఇలా అయితే ఆత్మహత్యలే శరణ్యం అంటూ తీవ్ర నైరాశ్యం చెందుతున్నారు. జిల్లాలోని ఏ రైతును కదిలించినా కన్నీటి వెతలే వినిపిస్తున్నాయి. రుణాల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. – కాణిపాకం

మినహాయింపు ఇవ్వాలి

ఆటో కొనుగోలు చేసేందుకు గతేడాది జీడీ నెల్లూరు మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ. లక్ష వరకు రుణం తీసుకున్నా. రెన్యూవల్‌కు సంబంధించి మెసేజ్‌ రావడంతో బ్యాంకు వద్దకు వెళ్లా. అక్కడ బ్యాంకర్లు అసలు, వడ్డీ చెల్లించాలని మొండికేశారు. వడ్డీ చెల్లించి రెన్యూవల్‌ చేస్తాను.. అంటే వాళ్లు ఒప్పుకోలేదు. అవస్థలు పడి మొత్తం డబ్బులు చెల్లించి ఏప్రిల్‌ 10వ తేదీన రెన్యూవల్‌ చేశా. ప్రభుత్వం రెన్యూవల్‌ విషయంలో మినహాయింపు ఇచ్చేలా చూడాలి.

– బాబు, జీడీనెల్లూరు

కొత్త విధానం అమల్లో ఉంది

రెన్యూవల్‌ కొత్త విధానం 2024 సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇకపై పూర్తి నగదు చెల్లించి రెన్యూవ ల్‌ చేయించుకోవాలి. ఇకపై వడ్డీ చెల్లించి రెన్యూవల్‌ చేయించుకునే పద్ధతి లేదు. దీనిపై సమస్యలు వస్తున్నాయి. కొంత మంది మంత్రులు ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఇది ఉన్నత స్థాయిలో జరగాల్సిన విషయం.

– హరీష్‌, ఎల్‌డీఎం, చిత్తూరు

చిత్తూరు మండలానికి చెందిన రాజు అనే రైతు 2021లో వ్యవసాయ పనుల నిమిత్తం ఓ బ్యాంకులో బంగారు ఆభరణాలు పెట్టి రూ.60 వేల వరకు రుణం తీసుకున్నాడు. ఏటా రెన్యూవల్‌ చేస్తూ వస్తున్నాడు. రెండు రోజుల కిందట బ్యాంకు రెన్యూవల్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన రైతు రాజుకు బ్యాంకు అధికారులు షాక్‌ ఇచ్చారు. మొత్తం డబ్బు చెల్లించి రెన్యూవల్‌ చేసుకోవాలని.. ఇప్పుడు కొత్త రూల్స్‌ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో చేసేదీ లేక రాజు అప్పు చేసి రూ.లక్ష చెల్లించి రెన్యూవల్‌ చేయించుకున్నాడు. ఇలా ఈ రైతు ఒక్కరే పరిస్థితి కాదు. లక్షల మంది అన్నదాతల సమస్య ఇదే.

10 శాతం బ్యాంకులు మినహా..మిగిలిన బ్యాంకులన్నీ రెన్యూవల్‌ విషయంలో రుణదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. రెన్యూవల్‌ పేరుతో వేధిస్తున్నాయి. తీసుకున్న రుణానికి ఏడాది గడువు తీరిందని మెసేజ్‌లు రావడంతో బ్యాంకులకు రుణదారులు పరుగులు పెడుతున్నారు. అక్కడికి వెళ్లాక బ్యాంకర్లు రెన్యూవల్‌ చేసుకోవాలంటే తీసుకున్న మొత్తం డబ్బులు చెల్లిస్తేనే రెన్యూవల్‌ చేస్తామని మెలిక పెడుతున్నారు. వడ్డీ చెల్లింపుతో..రెన్యూవల్‌ చేయడం ఇకపై కుదరదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. దీంతో వడ్డీ భారం పడుతుందని చాలా మంది అష్టకష్టాలు పడి రెన్యూవల్‌ చేయించుకుంటున్నారు. కొన్ని బ్యాంకులు తీసుకున్న రుణాలను పూర్తి స్థాయిలో చెల్లించినా.. మళ్లీ రుణాలు ఇవ్వడంలో రైతులు, రుణదారులను ఇబ్బందులు పెడుతున్నారు. రేపు రమ్మని చెప్పి వాళ్లను తిప్పించుకుంటున్నారు. సీ–బిల్‌, కేవైసీ, ఇతర వివరాల సాకు చూపి జాప్యం చేస్తున్నారు. గట్టిగా తిరగబడితే ఆర్బీఐ రూల్స్‌ అంటూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ పోరు పడలేక రెన్యూవల్‌ చేసుకునేందుకు చాలా మంది ముందుకు రావడంలేదు.

మొత్తం చెల్లిస్తేనే రెన్యూవల్‌ అంటూ వేధింపులు 
1
1/2

మొత్తం చెల్లిస్తేనే రెన్యూవల్‌ అంటూ వేధింపులు

మొత్తం చెల్లిస్తేనే రెన్యూవల్‌ అంటూ వేధింపులు 
2
2/2

మొత్తం చెల్లిస్తేనే రెన్యూవల్‌ అంటూ వేధింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement