
డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : ఎస్‌పీకేఎం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుపతి జిల్లా ఎస్‌పీకేఎం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీలో 53 సీట్లు, తమిళనాడు రాష్ట్రం సేలంలో 12, కర్ణాటక రాష్ట్రం గడగ్‌లో 2 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. సంబంధిత శిక్షణ కేంద్రాల్లో మూడేళ్ల పాటు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఈ శిక్షణలో చేరదలిచిన వారు 10వ తరగతి, తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు. బీసీ, జనరల్ కేటగిరిలో జూలై 1వ తేదీ నాటికి 15 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు, ఎస్‌సీ, ఎస్టీలకు 25 ఏళ్లు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. మూడేళ్ల కోర్సులో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఒకేషనల్ (టెక్స్‌టైల్స్), ఐటీఐ (రెండేళ్లు) కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు నేరుగా డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు www.iihtvgr.com వెబ్‌సైట్‌లో పరిశీలించాలని కలెక్టర్ కోరారు.
ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం తనిఖీ
శ్రీరంగరాజపురం : మండలంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని డీఆర్‌డీఏ అధికారి శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పంచడానికి ఈ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. మహిళలకు ఉచిత టైలరింగ్, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ మోహన్‌మురళి, ఏపీఎం రోజా, టైలరింగ్ శిక్షణ అధికారి గీతాకుమారి, భాను పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయ లక్ష్యం రూ.980.17 కోట్లు
చిత్తూరు కార్పొరేషన్: రిజిస్ట్రేషన్ శాఖ చిత్తూరు, తిరుపతి జిల్లాల 2025–26 ఆదాయ లక్ష్యం రూ.980.17 కోట్లుగా నిర్ణయించినట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ గిరిబాబు తెలిపారు. ఆయన గురువారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు. తిరుపతి జిల్లా వార్షిక ఆదాయ లక్ష్యం రూ.762 కోట్లని తెలిపారు. అందులో అత్యధికంగా రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ.153 కోట్లు, అత్యల్పంగా చిన్నగొట్టిగల్లు కార్యాలయానికి రూ.6.73 కోట్లు లక్ష్యంగా పెట్టినట్టు తెలిపారు. చిత్తూరు జిల్లాలో రూ.218.17 కోట్లు లక్ష్యం కాగా అత్యధికంగా చిత్తూరు అర్బన్ (ఆర్వో) సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ.77.79 కోట్లు, అత్యల్పంగా కార్వేటినగరం కార్యాలయానికి రూ.10.88 కోట్లుగా నిర్దేశించినట్టు వెల్లడించారు. గత సంవత్సరం తిరుపతి జిల్లా ఆదాయ లక్ష్యం రూ.626 కోట్లు కాగా రూ.521 కోట్లు వచ్చిందన్నారు. చిత్తూరు జిల్లా లక్ష్యం రూ.181.78 కోట్లు కాగా రూ.144.50 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.
19న వైస్ ఎంపీపీ ఎన్నిక
తవణంపల్లె: తవణంపల్లె మండల వైస్ ఎంపీపీ ఎన్నిక కోసం ఈనెల 13న నోటిఫికేషన్ జారీ చేసినట్లు స్థానిక ఇన్‌చార్జి ఎంపీడీఓ, అసిస్టెంట్ ఎన్నికల అధికారి రాఘవేంద్రరాజు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డీపీఓ సుధాకర్ పర్యవేక్షణలో ఈనెల 19న సోమవారం ఉదయం 11 గంటలకు చేతులు ఎత్తే పద్ధతిలో తవణంపల్లె మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని 15 ఎంపీటీసీలకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. మండలంలో మొత్తం 14 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు ఉండగా.. ఒకరు టీడీపీ ఎంపీటీసీ ఉన్నారు. వైస్ ఎంపీపీ ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.