
నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన న్యాయవాది తొలగింపు
పలమనేరు : న్యాయ విద్యకు సంబంధించి నకిలీ ఽధ్రువపత్రాలను సమర్పించి బార్ కౌన్సిల్‌ను మోసం చేసి పలమనేరు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న జి. సుబ్రమణ్యంను రాష్ట్ర బార్ కౌన్సిల్ నుంచి వెంటనే తొలగించినట్లు ఏపీ బార్ కౌన్సిల్ కార్యదర్శి పద్మలత బుధవారం ఆదేశాలను జారీ చేశారు. ఆ మేరకు ఉత్తర్వులు స్థానిక కోర్టుకు పంపారు. న్యాయవాదులుగా బార్ కౌన్సిల్‌లో అర్హత లేకున్నా తప్పుడు ధ్రువపత్రాలతో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసినట్లు నకిలీ పత్రాలను అందజేసినట్లు పరిశీలనలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది అక్రమంగా పలు కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నట్టు గుర్తించిన బార్ కౌన్సిల్ తక్షణమే వీరిపై వేటు వేసింది. ఇందులో భాగంగా పలమనేరు కోర్టులో రిజిస్ట్రర్ చేసుకున్న జి. సుబ్రమణ్యంపై వేటు పడింది. దీనిపై మరింత విచారణ చేపట్టి వీరికి ఏ కళాశాల నుంచి నకిలీ సర్టిఫికెట్లు అందాయి? ఎలా ఎన్‌రోల్ చేసుకున్నారో కూపీ లాగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పలమనేరులో సంచలనం రేకెత్తించింది.
నేడే డీఎస్సీ దరఖాస్తుకు ఆఖరు గడువు
తిరుపతి సిటీ : టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వ విడుదల చేసిన డీఎస్సీ–2025కు ద రఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియ నుంది. ఈనెల 30వ తేదీ నుంచి హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకును అవకాశం ఉంటుంది. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.
శ్రీవారి దర్శనానికి 3 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 74,477 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,294 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 2.84 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వస్తే క్యూలో అనుమతించమని స్పష్టం చేసింది.

నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన న్యాయవాది తొలగింపు